ఉద్యమ విరమణపై నిర్ణయం నేడు

రైతు ఉద్యమ నేతల డిమాండ్లు అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. అధికార వర్గాల నుంచి తాజాగా అందిన సవరణ ప్రతిపాదనలపై సంయుక్త కిసాన్‌ మోర్చాలోని నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక మిగిలిందల్లా ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అధికారిక పత్రం(గవర్నమెంట్‌ లెటర్‌హెడ్‌)పై రాసి ఇవ్వడమే.

Updated : 09 Dec 2021 05:29 IST

ప్రభుత్వ తాజా ప్రతిపాదనలు ఆమోదయోగ్యమే
సంయుక్త కిసాన్‌ మోర్చా వెల్లడి
రైతు నేతల డిమాండ్ల ప్రకారం 

వాగ్దాన ముసాయిదాను సవరించిన కేంద్రం!

దిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు

దిల్లీ: రైతు ఉద్యమ నేతల డిమాండ్లు అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. అధికార వర్గాల నుంచి తాజాగా అందిన సవరణ ప్రతిపాదనలపై సంయుక్త కిసాన్‌ మోర్చాలోని నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక మిగిలిందల్లా ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అధికారిక పత్రం(గవర్నమెంట్‌ లెటర్‌హెడ్‌)పై రాసి ఇవ్వడమే. ఆ వాగ్దాన పత్రం తమకు అందిన వెంటనే సమావేశమై ఉద్యమ విరమణపై నిర్ణయం తీసుకుంటామని 40 రైతుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ప్రభుత్వం నుంచి వచ్చిన సవరణ ప్రతిపాదనలపై మా మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఎస్‌కేఎం నేతలందరం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమై ఉద్యమ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటామ’’ని బుధవారం కిసాన్‌ మోర్చా భేటీ అనంతరం రైతు నేత గుర్నామ్‌ సింగ్‌ చాదుని వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చల కోసం ఎస్‌కేఎం నియమించిన అయిదుగురు సభ్యుల కమిటీ అంతకుముందు దిల్లీలో సమావేశమైంది. ప్రభుత్వం నుంచి అందిన తాజా ప్రతిపాదనలపై చర్చించింది. ఆ తర్వాత ఎస్‌కేఎంలోని భాగస్వామ్య సంఘాల నేతలతో భేటీ నిర్వహించగా అందరూ వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. ‘ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వ మైదానంలో ఉంది’ అని ఎస్‌కేఎం కమిటీ సభ్యుల్లో ఒకరైన యుధ్‌వీర్‌ సింగ్‌ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి మంగళవారం అందిన ప్రతిపాదనల్లో... పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామనే హామీ లభించినప్పటికీ....నిరసనలు విరమిస్తేనే రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామంటూ షరతు విధించడాన్ని ఎస్‌కేఎం నేతలు తప్పుపట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై ఏర్పాటు చేసే కమిటీలో ఉద్యమంతో సంబంధం లేని రైతు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రతిపాదననూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు నేతల డిమాండ్లను అంగీకరించింది. పంటల మద్దతు ధరల చట్టబద్ధతపై ఏర్పాటు చేసే కమిటీలో ఎస్‌కేఎం సభ్యులను చేర్చేందుకు ప్రభుత్వం సమ్మతించింది. రైతులపై మోపిన కేసులను తక్షణమే ఎత్తివేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, దిల్లీ ప్రభుత్వాలు అంగీకరించాయని కిసాన్‌ మోర్చా వర్గాలు తెలిపాయి. విద్యుత్‌ సవరణ బిల్లులో రైతులపై ప్రభావాన్ని చూపే నిబంధనల గురించి ఎస్‌కేఎంతో చర్చించిన తర్వాతే పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని