ధాన్యం సేకరణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే

ఒప్పందం మేరకు ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ మరోసారి స్పష్టంచేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుచేసి, దాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.

Published : 09 Dec 2021 05:26 IST

ఎఫ్‌సీఐ బియ్యం మాత్రమే కొనుగోలు చేస్తుంది
చెప్పింది ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ఎంపీ ఉత్తమ్‌ ప్రశ్నకు పీయూష్‌ గోయల్‌ సమాధానం

ఈనాడు, దిల్లీ: ఒప్పందం మేరకు ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ మరోసారి స్పష్టంచేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుచేసి, దాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆహారభద్రత పథకాలపై అడిగిన ప్రశ్నకు అనుబంధంగా నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణలో బియ్యం సేకరణ గురించి ప్రశ్నించారు. ‘‘తెలంగాణ నుంచి 40 లక్షల టన్నుల బియ్యం సేకరించడానికి ఎఫ్‌సీఐ ఆగస్టులో అంగీకరించింది. అక్టోబరు నుంచి వడ్లు మార్కెట్‌లోకి రావడం మొదలైంది. ఎఫ్‌సీఐ ఇప్పటివరకూ చెప్పినదాంట్లో సగం బియ్యం కూడా సేకరించలేదు. కారణమేంటి’’ అని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల జాబితాలో ఉన్న ప్రశ్నకు ఈ అంశంతో సంబంధం లేకపోయినా పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నందున దానికి బదులివ్వాలనుకుంటున్నట్లు పీయూష్‌ గోయల్‌ స్పష్టంచేశారు. ఆయన మాట్లాడుతూ, ‘‘తెలంగాణ నుంచి రికార్డుస్థాయిలో బియ్యం సేకరించడానికి ఎఫ్‌సీఐ అనుమతి ఇచ్చింది. అక్కడ ఎఫ్‌సీఐ నేరుగా బియ్యం కొనుగోలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలుచేసి, దాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పిన బియ్యాన్ని ఇవ్వకపోవడంతో వారికి నాలుగైదుసార్లు గడువు పెంచాం. ఇన్నిసార్లు గడువు పొడిగించిన తర్వాత కూడా ఆ రాష్ట్రం అనుమతి ఇచ్చిన మేరకు ముడిబియ్యం, ఉప్పుడు బియ్యం ఇవ్వలేదని ఆవేదనతో చెప్పాల్సి వస్తోంది. అనుమతి ఇచ్చిన మేరకు తీసుకోవడానికి ఎఫ్‌సీఐ ఇప్పటికీ సిద్ధంగా ఉంది ’’ అని గోయల్‌ స్పష్టంచేశారు. మంత్రి సమాధానంపై ఎంపీ రేవంత్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. సభలో వక్రీకరించిన సత్యాలు చెప్పారని, అదే ఇక్కడ సమస్య అని ఆరోపించారు. స్పీకర్‌ ఓం బిర్లా చర్చను అంతటితో ముగిస్తున్నట్లు ప్రకటించారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది అసమర్థత: ఉత్తమ్‌

పార్లమెంటు బయట ఉత్తమ్‌ విలేకర్లతో మాట్లాడుతూ...ధాన్యం కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుచూపు లేకుండా, అసమర్థతతో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పంజాబ్‌ వానాకాలం పంటకు సంబంధించి 1.13 కోట్ల మెట్రిక్‌ టన్నులు, హరియాణా 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కేంద్రానికి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంటే, తెలంగాణ  40 లక్షల మెట్రిక్‌ టన్నులకే ఎందుకు అంగీకరించిందని ప్రశ్నించారు. ఒప్పందంలో ఇప్పటివరకు కేవలం 10 లక్షల మె.టన్నులే కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వడ్ల రవాణాకు సంబంధించి ట్రాన్స్‌పోర్ట్‌ ఒప్పందానికి ఇటీవలే టెండర్లు పిలిచారని, ఇవన్నీ ధాన్యం సేకరణలో జాప్యానికి కారణమయ్యాయని ఆక్షేపించారు. రాష్ట్రంలోని ధాన్యం అంతా కొనేందుకు రూ.10 వేల కోట్లు కూడా ఖర్చుకాదని, రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌లో రైతుల కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేరా? అని నిలదీశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని