Published : 09/12/2021 05:27 IST

కేవీపీ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు?

 ఓఎంసీ కేసులో సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు
ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పిటిషన్‌పై విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో సాక్షి ఇచ్చిన వాంగ్మూలంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు పేరును ప్రస్తావించినపుడు.. ఆయన వాంగ్మూలాన్ని ఎందుకు తీసుకోలేదని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. ఓఎంసీ కేసులో గనుల చట్టానికి విరుద్ధంగా, నిర్లక్ష్యంగా సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసి పరిహారం ఇప్పించాలంటూ ఏపీ ఐఏఎస్‌ అధికారిణి వై.శ్రీలక్ష్మి 2015లో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్‌ వాదనలు వినిపిస్తూ.. శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసీకి లీజులు కేటాయించారని చెప్పారు. గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓఎంసీ కర్ణాటకలో అక్రమంగా మైనింగ్‌ చేసి, ఖనిజాన్ని తరలించడానికి వీలుగా పిటిషనర్‌ ఏపీలో లీజులు కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాకముందే లీజులు కేటాయించారని చెప్పారు. ఇతరులు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని, అంతేగాకుండా ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని చెప్పారంటూ శశికుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రస్తావించారు. ‘నా దరఖాస్తును పరిశీలించాలని శ్రీలక్ష్మిని సంప్రదించాను. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. కోట్లలో చెల్లించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. అంతేగాకుండా ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావును కలిసి అధికారులకు ఎంతెంత చెల్లించాలో బేరమాడాలని సలహా ఇచ్చారు. అప్పటి గనులశాఖ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌ను కలిస్తే సానుకూలంగా స్పందిస్తారని చెప్పారు. మరోసారి కలిసినప్పుడు రూ.8 లక్షలు డిమాండ్‌ చేశారు’ అని శశికుమార్‌ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సీబీఐ న్యాయవాది చెప్పారు. మరి కేవీపీ వాంగ్మూలం తీసుకున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. లేదని సీబీఐ న్యాయవాది చెప్పారు. కేసులో శ్రీలక్ష్మి పాత్రను విడిగా చూడటానికి వీల్లేదన్నారు. ఇతర నిందితులతో కలిసి వారికి లబ్ధి చేకూరేలా కుట్ర పన్నారన్నారు. సరిహద్దు వివాదం తేలేదాకా విచారణను నిలిపివేయాలని, తనపై కేసు కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్లను ఈ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందన్నారు. సీబీఐకి పరిధి లేదని పిటిషనర్‌ చెప్పడంపై విభేదించారు. ఏపీ ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. విచారణలో సీబీఐ కేసును రుజువు చేస్తుందని, ఈ దశలో కేసుపై నిర్ణయం తీసుకోరాదని, శ్రీలక్ష్మి పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

కుట్ర చేశారనడానికి ఆధారాలేవి?
అంతకుముందు శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది రాఘవాచార్యులు వాదనలు వినిపిస్తూ మైనింగ్‌ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే ఉన్నతాధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారన్నారు. అంతేతప్ప సీబీఐకి దర్యాప్తు చేసే పరిధి లేదన్నారు.   నిందితులతో కలిపి శ్రీలక్ష్మి కుట్ర పన్నారనడానికి ఒక్క ఆధారమూ చూపలేదన్నారు. కర్ణాటక నుంచి ఖనిజం తరలిస్తున్నారంటున్నారని, అలాంటప్పుడు ఏపీలో అక్రమ మైనింగ్‌ జరగలేదన్నారు. నిబంధనల ప్రకారమే మైనింగ్‌ లీజు మంజూరు చేశారని, దీనికి కేంద్రం కూడా ఆమోదం తెలిపిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని