‘పురాణ’ పురుషుడు ఇకలేరు

ఆధ్యాత్మిక స్రష్ట, పౌరాణిక సార్వభౌముడు, సుప్రసిద్ధ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) ఇకలేరు. హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని స్వగృహంలో శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు కన్నుమూశారు.

Updated : 15 Jan 2022 05:09 IST

మల్లాది చంద్రశేఖరశాస్త్రి అస్తమయం

కవాడిగూడ, గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక స్రష్ట, పౌరాణిక సార్వభౌముడు, సుప్రసిద్ధ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) ఇకలేరు. హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని స్వగృహంలో శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు కన్నుమూశారు. ఆయనకు భార్య సీతారామ ప్రసన్న, ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం హసనాబాద్‌లో ఆదిలక్ష్మమ్మ, దక్షిణామూర్తి శాస్త్రి దంపతులకు 1925 ఆగస్టులో జన్మించారు. చంద్రశేఖర శాస్త్రి తెలుగు, సంస్కృతం, వేదం, వేదాంతం, తర్కం, మీమాంస, వ్యాకరణం, పంచదశి, రామాయణం, భారతం, పురాణాలు, ఇతిహాసాల్లో నిష్ణాతులు. పౌరాణిక సార్వభౌమ, అభినవ వ్యాస, బ్రహ్మశ్రీ, మహా మహోపాధ్యాయ బిరుదులు పొందారు. శృంగేరి పీఠాధిపతుల నుంచి సవ్యసాచి బిరుదును, సద్గురు శివానందమూర్తి నెలకొల్పిన సనాతన ధర్మట్రస్ట్‌ ద్వారా ఎమినెంట్‌ సిటిజన్‌ అవార్డును అందుకున్నారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో సత్కారం అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత ఆస్థాన పండితునిగా సేవలందించారు. 2005లో ప్రతిష్ఠాత్మక రాజా-లక్ష్మీ అవార్డు ద్వారా వచ్చిన రూ.లక్ష నగదును సనాతన ధర్మట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. శనివారం ఉదయం సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేట హిందూ శ్మశానవాటికలో చంద్రశేఖర శాస్త్రి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

తాత వద్దే వేదాధ్యయనం

అమరావతి పరిసర గ్రామాల్లో వేదవిద్యకు మల్లాది వారి కుటుంబం పేరు పొందింది. చంద్రశేఖరశాస్త్రి బాల్యంలో తన తాత మల్లాది రామకృష్ణ చయనుల దగ్గరే సంస్కృతం, తెలుగు నేర్చుకోవడంతో పాటు వేదాధ్యయనం చేశారు. పదిహేనవ ఏటే ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. ఆయన ప్రవచనం చెబుతుంటే శ్రోతలు మంత్రముగ్ధులయ్యేవారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, భద్రాద్రి సీతారాముల కల్యాణం, శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక కల్యాణం జరిగినపుడు వ్యాఖ్యానం చెప్పేవారు. పత్రికల్లో వ్యాసాలు రాయడంతో పాటు రేడియో, టీవీ ఛానళ్లలో భక్తి సంబంధ కార్యక్రమాల్లో ప్రసంగించేవారు. ప్రజలు అడిగే ఆధ్యాత్మిక సందేహాలకు సాధికారికంగా సమాధానమిచ్చేవారు.

తెలుగువారికి తీరని లోటు  

మల్లాది చంద్రశేఖరశాస్త్రి మృతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి,  తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌,  తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌లు సంతాపం ప్రకటించారు. ఆధ్యాత్మిక రంగంలో చంద్రశేఖరశాస్త్రి సేవలు ఎనలేనివని, ఆయన మృతి తెలుగువారికి తీరని లోటని వారు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని