నేపోతానయ్యా..సర్కారు దవాఖానాకు!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు సంగారెడ్డి జిల్లా గర్భిణులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు నెలాఖరు వరకున్న గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సేవలు మెరుగుపడటం, కేసీఆర్‌ కిట్‌,

Published : 15 Jan 2022 03:54 IST

ప్రభుత్వాసుపత్రులనే ఆశ్రయిస్తున్న సంగారెడ్డి గర్భిణులు
ప్రసవాల్లో 70 శాతానికి పైగా వాటిలోనే

ఈనాడు, సంగారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు సంగారెడ్డి జిల్లా గర్భిణులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు నెలాఖరు వరకున్న గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సేవలు మెరుగుపడటం, కేసీఆర్‌ కిట్‌, నగదు సాయం అందిస్తుండటంతో పాటు.. వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని మొత్తం ప్రసవాల్లో 70.74శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అయ్యాయి. వీటిలో సాధారణ ప్రసవాలు 67.24శాతం కావడం గమనార్హం. ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల్లో హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాలతో పోల్చితే సంగారెడ్డి ప్రథమస్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో నల్గొండ(51.46 శాతం), నిజామాబాద్‌(44.92 శాతం) ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లోనూ సాధారణ ప్రసవాలు 45శాతానికి మించలేదు. సిజేరియన్లే ఎక్కువగా అవుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులతో పరిశీలిస్తే సిజేరియన్లు నిజామాబాద్‌ జిల్లాలో 90.11శాతం కాగా.. నల్గొండలో అది 87.41 శాతంగా ఉంది.

గర్భం దాల్చినప్పటి నుంచి అవగాహన

సాధారణ ప్రసవం జరిగితే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని వైద్యాధికారులు గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. పుట్టిన వెంటనే తల్లి తన బిడ్డకు పాలు తాగించడానికి వీలవుతుంది.. సిజేరియన్‌ ద్వారా ఆ అవకాశం ఉండదని వివరిస్తున్నారు. అందుకే జిల్లాలో సహజ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా ప్రయత్నం చేస్తున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆశాలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం? అనే విషయాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకునేలా చూస్తున్నారు. ప్రసవించే సమయం దగ్గరకు రాగానే వారికి ఫోన్‌ చేసిలా ఆసుపత్రిలో చేరేలా చూస్తున్నారు.  


జిల్లా కేంద్రంలోనే అధికంగా..
- డాక్టర్‌ సంగారెడ్డి, ప్రాంతీయ ఆసుపత్రుల పర్యవేక్షకులు

జిల్లాలో నెలకు సగటున 2వేల వరకు ప్రసవాలు అవుతుంటాయి. వీటిలో 35 శాతానికి పైగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జరుగుతున్నాయి. మాతాశిశు ఆరోగ్య కేంద్రంతో పాటు నవజాత శిశువులకూ ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. దీంతో ప్రతినెలా 700 నుంచి 800 వరకు ఇక్కడ కాన్పులు అవుతుంటాయి. సహజ ప్రసవాలే అధికంగా అయ్యేలా చొరవ చూపుతున్నాం. కుదరని పక్షంలో మాత్రమే సిజేరియన్లు చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని