తెలంగాణలో పరిశ్రమ స్థాపించండి

ప్రసిద్ధ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌కు చెందిన అతిపెద్ద ప్రాంగణం ఎక్కడుందో తెలుసా? అని కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రాంగణ భారీ భవనం ఫోటోను ట్విటర్‌కు జత చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించి.. హైదరాబాద్‌ అని సమాధానమిచ్చారు.

Published : 17 Jan 2022 04:16 IST

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌కు కేటీఆర్‌ ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో భారీ పెట్టుబడులతో పరిశ్రమను స్థాపించాలని ప్రపంచ అగ్రశ్రేణి ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ అధినేత ఎలన్‌మస్క్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించారు. భారత్‌లో సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ట్విటర్‌ ద్వారా కోరారు. భారత్‌ మార్కెట్‌లోకి టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయని ఎలన్‌మస్క్‌ శనివారం చేసిన ట్వీట్‌పై ఆయన ఈ మేరకు స్పందించారు. టెస్లాతో కలిసి పనిచేయడం తమకు సంతోషదాయకమన్నారు. భారత్‌లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా, పెట్టుబడులకు స్వర్గధామంగా, పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా కారును స్వయంగా నడిపిన ఫొటోను కేటీఆర్‌ తన ట్వీట్‌కు జత చేశారు. కారు బాగుందని, ఎలన్‌ మస్క్‌ కొత్తగా ఆలోచించారని అప్పట్లో చేసిన ట్వీట్‌ను సైతం ఆయన గుర్తు చేశారు. కాగా కేటీఆర్‌ ఆహ్వానంపై ఎలన్‌ స్పందించారు. కేంద్రంతో ఇంకా చర్చిస్తున్నామని, చర్చలు కొలిక్కి రాలేదంటూ ఆయన పేర్కొన్నారు. 2003లో టెక్సాస్‌లో ప్రారంభమైన టెస్లా ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో మొదటిస్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం ఎలక్ట్రిక్‌ వాహనాల్లో 23 శాతం ఇవి తయారు చేస్తున్నవే. భారత్‌లో తమ తొలి యూనిట్‌ను స్థాపించేందుకు గత ఏడాది కాలంగా ఎలన్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఫార్ములా ఇ-రేస్‌ల నిర్వహణపై నేడు ఒప్పందం

తెలంగాణలో ఎలక్ట్రానిక్‌ వాహనాలతో ఫార్ములా రేస్‌ జాతీయస్థాయి వార్షిక పోటీల నిర్వహణకు హైదరాబాద్‌ వేదిక కానుంది. దీని కోసం ఫార్ములా ఇ-అసోసియేషన్‌తో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోంది.


మరో మూడు రాష్ట్రాలూ ఆహ్వానించాయ్‌..

చండీగఢ్‌: విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి కేంద్రాన్ని తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాల నేతలూ ఎలన్‌ మస్క్‌ను ఆహ్వానించారు. తాను ప్రతిపాదిస్తున్న ‘పంజాబ్‌ నమూనా’లో లూధియానా నగరం విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమకు హబ్‌గా ఎదుగుతుందని పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ట్వీట్‌ చేశారు. అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావాలని మస్క్‌ను కోరారు. మహారాష్ట్రలో టెస్లా కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే పూర్తి తోడ్పాటు అందిస్తామని ఆ రాష్ట్ర మంత్రి జయంత్‌ పటేల్‌ హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్‌ గులాం రబ్బానీ కూడా మస్క్‌కు ఇదే రకమైన ఆహ్వానాన్ని అందించారు.


ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్‌ ప్రాంగణం ఎక్కడుంది?

ప్రసిద్ధ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌కు చెందిన అతిపెద్ద ప్రాంగణం ఎక్కడుందో తెలుసా? అని కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రాంగణ భారీ భవనం ఫోటోను ట్విటర్‌కు జత చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించి.. హైదరాబాద్‌ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో 15 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా బయట అమెజాన్‌ ఏర్పాటు చేసిన ప్రాంగణం ఇదే కావడం గమనార్హం. ఇటీవల పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ గురించి సైతం కేటీఆర్‌ ఇలాంటి ప్రశ్న వేసి సమాధానం రాబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని