సికింద్రాబాద్‌ క్లబ్‌ అగ్నికి ఆహుతి

హైదరాబాద్‌లోని ప్రముఖ వారసత్వ భవనం అగ్నికి ఆహుతైంది. దాదాపు ఒకటిన్నర శతాబ్దాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో ప్రధాన భవనం పూర్తిగా దగ్ధమైంది.

Published : 17 Jan 2022 04:16 IST

143 ఏళ్ల చారిత్రక భవనంలో మంటలు
షార్ట్‌ సర్క్యూటే ప్రధాన కారణం
రూ.25 కోట్ల ఆస్తినష్టం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కంటోన్మెంట్‌: హైదరాబాద్‌లోని ప్రముఖ వారసత్వ భవనం అగ్నికి ఆహుతైంది. దాదాపు ఒకటిన్నర శతాబ్దాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో ప్రధాన భవనం పూర్తిగా దగ్ధమైంది. పురాతన, అరుదైన వస్తువులెన్నో అగ్నికీలల్లో బూడిదయ్యాయి. అందమైన నగిషీలతో ఆకట్టుకునే భవనం మాడిమసై.. చరిత్రలో ఓ పుటగా మిగిలిపోయింది. భవనంలో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని పరికరాలు, ఫర్నిచర్‌ దగ్ధమైపోగా.. సుమారు రూ.25 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి భారీ వర్షం పడటంతో విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చాయని, కొద్దిసేపటికే భవనం లోపలి నుంచి మంటలు వ్యాపించాయని సిబ్బంది తెలిపారు. క్లబ్‌ ముందు భాగం కలపతో చేసింది కావటంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ప్రమాద సమాచారం చేరవేతలో అరగంట జాప్యం కారణంగా భారీస్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

ఘనమైన చరిత్ర

దేశంలోనే అతి ప్రాచీనమైన క్లబ్బుల్లో ఒకటిగా సికింద్రాబాద్‌ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని 1878లో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ క్లబ్‌కు వారసత్వ హోదా ఇచ్చింది. సికింద్రాబాద్‌ గ్యారిసన్‌ క్లబ్‌, సికింద్రాబాద్‌ జింఖానా క్లబ్‌, యునైటెడ్‌ క్లబ్‌ తదితర పేర్లతో పిలిచేవారు. 1947 వరకు బ్రిటిష్‌ అధికారులు, నవాబులు, ఉన్నతస్థాయిలో ఉన్నవారికే ఇందులో సభ్యత్వం ఉండేది. ఇప్పుడు ఆర్మీ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, పోలీసు అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు సహా అన్ని రంగాలకు చెందినవారు శాశ్వత, క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. సభ్యత్వ రుసుం దాదాపు రూ.12 లక్షల వరకు ఉంటుంది. శాశ్వత సభ్యత్వం దక్కాలంటే కనీసం పదేళ్లు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం 5,000 మందికిపైగా సభ్యత్వం ఉండగా 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఐదు నక్షత్రాల హోటల్‌లో ఉండే అత్యాధునిక వసతులన్నీ ఇందులో ఉంటాయి. దీనికి అనుబంధంగా సెయిలింగ్‌ ఉంది. లోపల ఒక పెట్రోల్‌ పంపు కూడా ఉంటుంది. దేశీయంగానే కాకుండా అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియాలో ఉన్న సుమారు వంద అగ్రశ్రేణి క్లబ్‌లతో దీనికి అనుబంధం ఉంది.


అగ్నిమాపక పరికరాలూ లేవు  

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్లబ్‌లో ఎలాంటి అగ్నిమాపక పరికరాలు లేనట్లు గుర్తించారు. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) సైతం లేనట్లు వెల్లడైంది. ఎన్‌వోసీ తీసుకున్నామని, అగ్నిప్రమాదంలో అది దగ్ధమైందని నిర్వాహకులు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. కానీ అగ్నిమాపక శాఖ అధికారులు తమ రికార్డుల్లో అలాంటి పత్రం గుర్తించలేకపోయారు. 15 మీటర్లకంటే ఎత్తు ఉన్న ప్రముఖ సంస్థలు, భారీ భవంతులకు సంబంధించి ఏటా ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌ జరుగుతుంటుంది. క్లబ్‌ ఎత్తు 14 మీటర్లే ఉండటంతో ఆడిట్‌ జరగడం లేదు. నిబంధనల ప్రకారం 6 మీటర్ల ఎత్తు ఉన్నవాటికి.. ఎక్కువమంది జనం వచ్చిపోయే ఇలాంటి క్లబ్‌  అగ్నిమాపక అనుమతి తప్పనిసరి. అగ్నిమాపక సేవల శాఖ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అగ్నిమాపక శాఖ బృందాలు ఆదివారం నిజాం క్లబ్‌, ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌.. తదితర 11 ప్రముఖ క్లబ్‌లలో అగ్నిమాపక పరికరాల స్థితిగతులపై తనిఖీలు చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని