భారత్‌కు శక్తినిచ్చిన టీకా

కొవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో.. టీకా పంపిణీ యజ్ఞం భారత్‌కు గొప్ప శక్తినిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని పరిరక్షించేందుకు అది దోహదపడిందని పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమై

Published : 17 Jan 2022 04:16 IST

వ్యాక్సినేషన్‌ క్రతువుపై ప్రధాని మోదీ వ్యాఖ్య

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో.. టీకా పంపిణీ యజ్ఞం భారత్‌కు గొప్ప శక్తినిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని పరిరక్షించేందుకు అది దోహదపడిందని పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమై ఆదివారంతో ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆయన ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘‘కరోనా మహమ్మారి తొలిసారి ముంచుకొచ్చినప్పుడు దాని గురించి అంతగా ఎవరికీ తెలియదు. అయినా మన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు టీకా అభివృద్ధి పనుల్లో తలమునకలై విజయం సాధించారు. వ్యాక్సిన్‌ పంపిణీ క్రతువులో పాలుపంచుకుంటున్న ప్రతిఒక్కరికీ నేను అభివందనం చేస్తున్నా’’ అని మోదీ పేర్కొన్నారు. దేశంలో ప్రధాని మోదీ సమర్థ నాయకత్వంలో వ్యాక్సినేషన్‌ దిగ్విజయంగా సాగుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.  

156.76 కోట్ల డోసుల పంపిణీ

దేశంలో కొవిడ్‌ టీకా పంపిణీకి 2021 జనవరి 16న శ్రీకారం చుట్టారు. ఆరోగ్యరంగ సిబ్బందితో మొదలుపెట్టి.. తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, దశలవారీగా వయోజనులందరికీ వ్యాక్సిన్లు అందించడం ప్రారంభించారు. ఈ నెల 3 నుంచి..    15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. మరోవైపు ప్రికాషన్‌ డోసుల పంపిణీ కూడా సాగుతోంది. మొత్తంగా దేశంలో ఇంతవరకు 156.76 కోట్ల డోసులను వేశారు. పంపిణీ మొదలయ్యాక.. 9 నెలల కంటే తక్కువ వ్యవధిలోనే 100 కోట్ల డోసులను అందించడం గొప్ప మైలురాయి.

ఒక్కరోజే 2.71 లక్షల కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. తాజాగా 24 గంటల్లో 2,71,202 మంది కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 3,71,22,164కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.28%గా నమోదైంది. క్రియాశీలక కేసుల సంఖ్య 15,50,377కు చేరుకుంది. తాజాగా ఒక్కరోజులో 314 మంది కరోనా కారణంగా మరణించారు. కేరళలో 106, పశ్చిమబెంగాల్‌లో 39 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 4,86,066కు పెరిగింది.

ఒమిక్రాన్‌ కొత్త కేసులు.. 1,702

దేశంలో ఒమిక్రాన్‌ కొత్త కేసులు ఒక్కరోజులో 1,702 నమోదయ్యాయి. ఈ వేరియంట్‌ బాధితుల మొత్తం సంఖ్య 7,743కు పెరిగింది. ఒమిక్రాన్‌ కొత్త కేసుల్లో ఒక్కరోజులోనే 28.17% పెరుగుదల కనిపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని