డిస్కం నుంచే కాదు.. బయటా కరెంటు కొనుక్కోవచ్చు

విద్యుత్‌ వాహనాల(ఈవీల)కు ఛార్జింగ్‌ సదుపాయాలు సులభతరం కానున్నాయి. ‘రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం) నుంచే కాకుండా.. కరెంటు ఛార్జీలు తక్కువగా వసూలు చేసే మరో విద్యుత్‌ సంస్థ నుంచైనా కొని ఛార్జింగ్‌ స్టేషన్‌కు వాడుకోవచ్చు.

Updated : 17 Jan 2022 05:55 IST

హైవేలపై ప్రతి 25 కి.మీ.లకు ఒక ఛార్జింగ్‌ స్టేషన్‌ తప్పనిసరి
విద్యుత్‌ వాహనాల సదుపాయాలపై కేంద్రం మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ వాహనాల(ఈవీల)కు ఛార్జింగ్‌ సదుపాయాలు సులభతరం కానున్నాయి. ‘రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం) నుంచే కాకుండా.. కరెంటు ఛార్జీలు తక్కువగా వసూలు చేసే మరో విద్యుత్‌ సంస్థ నుంచైనా కొని ఛార్జింగ్‌ స్టేషన్‌కు వాడుకోవచ్చు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల డిస్కంలకు కేంద్ర విద్యుత్‌ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు

* దేశంలో ఎక్కడైనా, ఎవరైనా ‘పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌’(పీసీఎస్‌) ఏర్పాటు చేయవచ్చు.

* యూనిట్‌ కరెంటు సరఫరాకు అయ్యే సగటు వ్యయం కన్నా ఎక్కువ ఛార్జీని స్టేషన్ల నుంచి వసూలు చేయకూడదు. 2025 వరకూ ఈ నిబంధనను డిస్కంలు పాటించాలి. తెలంగాణలో ప్రస్తుతం ఈ సగటు వ్యయం రూ.7.14. ఇంతకన్నా ఎక్కువ వసూలు చేయకూడదు.

* పబ్లిక్‌ స్టేషన్‌ కోసం తక్కువ ఛార్జీకే బయట మార్కెట్‌లో ఎవరైనా అమ్మితే ‘ఓపెన్‌ యాక్సెస్‌’లో కొనుక్కోవచ్చు. దీనికి దరఖాస్తు చేస్తే డిస్కం 15 రోజుల్లో అనుమతించాలి. ఆ కరెంటును కొన్న కేంద్రం నుంచి స్టేషన్‌కు సరఫరా చేయాలి. ఇందుకు అదనపు సర్‌ఛార్జీలు వేయకూడదు.

* జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 25 కి.మీ.లకొక పీసీఎస్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పెట్రోలు బంకులవారు ముందుకొస్తే అవకాశమివ్వాలి. ప్రతి 3 కి.మీ.ల పరిధిలో ఒక స్టేషన్‌ ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షలకు మించి జనాభా ఉన్న 9 నగరాల్లో, వాటికి వెళ్లే రహదారులు, హైవేలపై రాబోయే మూడేళ్లలో పీసీఎస్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలి. హైదరాబాద్‌ నగరంతో పాటు ఓఆర్‌ఆర్‌, నగరానికి వచ్చే 5 హైవేలపై పీసీఎస్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

* పీసీఎస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను ఆదాయం పంచుకునే విధానంలో లీజుకివ్వాలి. స్టేషన్‌ ఏర్పాటయ్యాక.. అక్కడ వాడే ప్రతి యూనిట్‌ కరెంటుపై రూపాయి చొప్పున లీజు కిరాయి కింద తీసుకోవాలి. రాష్ట్రస్థాయిలో ఒక ప్రభుత్వ సంస్థకు పీసీఎస్‌ల ఏర్పాటు బాధ్యతలు అప్పగించాలి.

ఇంట్లోనూ ఛార్జింగ్‌ చేసుకోవచ్చు

* ప్రజలు తమ ఇంట్లో ఉన్న కనెక్షన్‌ నుంచే వాహనాలను ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఇందుకు ఇంటి కరెంటు బిల్లులో ఎంత ఛార్జీ వేస్తారో అంతే వసూలు చేయాలి.

* అపార్ట్‌మెంట్లు, కాలనీలు, కార్యాలయ సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తదితరాల ఆవరణల్లో ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు దరఖాస్తు చేస్తే.. మెట్రో నగరాల్లో 7, మున్సిపాలిటీల్లో 15, గ్రామాల్లో 30 రోజుల్లోగా కొత్త కరెంటు కనెక్షన్‌లను డిస్కం ఇవ్వాలి.

* కొత్తగా నిర్మించే భవనాల్లో ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ భవన నిర్మాణాల బైలాస్‌ను పురపాలకశాఖ మార్చాలి.

* పబ్లిక్‌ స్టేషన్లలో ఛార్జింగ్‌ కోసం ఆన్‌లైన్‌ ద్వారా ముందుగా సమయం బుక్‌ చేసుకోవడానికి వాహనదారులకు అవకాశం కల్పించాలి.

* ఈవీలో ఉండే బ్యాటరీని ఛార్జింగ్‌ కోసం తీసుకుని, మరొకటి ఇచ్చే సదుపాయాన్ని స్టేషన్‌లోకల్పించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని