ఒమిక్రాన్‌కు రెమ్‌డెసివిర్‌ సరైన ఔషధం

‘‘ముప్పు ఎక్కువగా ఉన్నవారికి వైరస్‌ సోకితే.. ముందుగా అది ఒమిక్రానా? డెల్టానా? ఏ వేరియంట్‌ అనేది తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడే చికిత్స సులభమవుతుంది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ద్వారా ప్రాథమికంగా ఒక అంచనాకు రావచ్చు. ఒమిక్రాన్‌ అయితే రెమ్‌డెసివిర్‌ సరైన ఔషధం.

Updated : 17 Jan 2022 05:32 IST
ముప్పు ఎక్కువ ఉన్నవారికి ఈ చికిత్స అవసరం
డెల్టా అయితే మోనోక్లోనల్‌ వైద్యం కూడా అందుబాటులో
స్వల్ప లక్షణాలకు ఇంటి వద్దే..
తీవ్రత పెరిగితే ఆసుపత్రిలో చేరిక తప్పదు
తొలివారంలో యాంటీవైరల్‌తో ఉపయుక్తం
‘ఈనాడు’తో డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌

‘‘ముప్పు ఎక్కువగా ఉన్నవారికి వైరస్‌ సోకితే.. ముందుగా అది ఒమిక్రానా? డెల్టానా? ఏ వేరియంట్‌ అనేది తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడే చికిత్స సులభమవుతుంది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ద్వారా ప్రాథమికంగా ఒక అంచనాకు రావచ్చు. ఒమిక్రాన్‌ అయితే రెమ్‌డెసివిర్‌ సరైన ఔషధం. అదే డెల్టా అయితే మోనోక్లోనల్‌ యాంటీబాడీల చికిత్సగానీ, రెమ్‌డెసివిర్‌ గానీ లేదా రెండూ అందుబాటులో ఉన్నాయి. అన్నిసార్లూ వేరియంట్‌ను గుర్తించే అవకాశం లేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో రెమ్‌డెసివిర్‌ ఉత్తమ ఔషధం. ఇది రెండు వేరియంట్లకు కూడా భేషుగ్గా పనిచేస్తుంది’’ అని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీకి చెందిన ప్రముఖ శ్వాసకోశ వైద్య నిపుణులు డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా తెలిపారు. మోనోక్లోనల్‌ యాంటీబాడీలు చికిత్స ఇచ్చే ముందు ఒకసారి ‘న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు’ ఎన్ని ఉన్నాయో పరీక్షించాలన్నారు. ఎందుకంటే కొందరు వ్యాక్సిన్లు రెండుడోసులు.. మరికొందరైతే మూడోడోసు కూడా తీసుకొని ఉంటారు కాబట్టి.. వీరిలో న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు పెరిగి ఉంటాయని పేర్కొన్నారు. ఈ యాంటీబాడీలు 125 కంటే ఎక్కువగా ఉంటే మోనోక్లోనల్‌ చికిత్స అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. దీని చికిత్స విధానాలను ‘ఈనాడు’కు ఆయన వివరించారు.

మిక్రాన్‌ చికిత్సపై పలు సందేహాలున్నాయి?

మనకు అందుబాటులో ఉన్న యాంటీవైరల్‌ చికిత్స విధానాలు మూడే. 1.రెమ్‌డెసివిర్‌ 2.మోనోక్లోనల్‌ యాంటీబాడీలు(కాక్‌టైల్‌) 3.మోల్నుపిరవిర్‌. ఒమిక్రాన్‌ బాధితుల్లో కాక్‌టైల్‌ థెరపీ పనిచేయదు. ప్రస్తుతం డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ద్వారా ప్రమాద తీవ్రత తక్కువని తేలింది. బూస్టర్‌ తీసుకున్న వారిలో మరణాల శాతం కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేకపోతే.. పాజిటివ్‌ రాగానే కంగారుపడాల్సిన పనిలేదు. ఒకవేళ 60 ఏళ్లు దాటిన వారు.. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బు, క్యాన్సర్‌ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వీరిలో ముప్పు ఎక్కువే. లక్షణాలు గుర్తించిన ఏడు రోజుల్లోపు ఇలాంటి వారు యాంటీ వైరల్‌ చికిత్స పొందితే మంచిది. ఒకవేళ 60 ఏళ్లలోపు ఉండి.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడని వారైతే.. ఇంటి వద్దనే వైద్యుడి సలహా మేరకు చికిత్స పొందొచ్చు. దాదాపు వీరే 95 శాతం మంది ఉంటారు. ఒకవేళ వీరిలో లక్షణాల తీవ్రత పెరుగుతుంటే మాత్రం ఆసుపత్రులకు వెళ్లాల్సిందే. యాంటీ వైరల్‌ చికిత్సను 5-7 రోజుల్లోపు.. గరిష్ఠంగా 10 రోజుల్లోపు ఇవ్వాలి. ఆ గడువు దాటితే యాంటీ వైరల్‌ ఔషధాలు పనిచేయవు. మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని 18-45 ఏళ్ల మధ్యవయస్కులైన పురుషులు, స్త్రీలలో.. అంటే పునరుత్పత్తి.. గర్భధారణ వయసులో ఉన్నవారికి ఇవ్వకూడదు. రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిన పరిస్థితులున్నప్పుడే.. స్టెరాయిడ్‌ చికిత్స అందించాలి.

లక్షణాలు ఎలా కనిపిస్తున్నాయి?

ఒమిక్రాన్‌లో ప్రధానంగా తలనొప్పి చాలా ఎక్కువ.  పారాసెటమాల్‌కూ తగ్గడం లేదు. వీరిలో నీళ్ల విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు తక్కువ. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటివి కనిపిస్తున్నాయి. వీరిలో 95 శాతం మందికి ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకడం లేదు. ఆకలి ఉండి, రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే చికిత్స పొందొచ్చు. శ్వాసకోశాల్లోకి చొచ్చుకుపోయే లక్షణం ఒమిక్రాన్‌లో తక్కువ. అందువల్ల తక్కువ శాతం మందికి నిమోనియా వస్తుంది.  

బూస్టర్‌తో ఒమిక్రాన్‌ నుంచి రక్షణ ఉందా?

గతంలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన వారికీ మళ్లీ కొవిడ్‌ సోకే అవకాశాలుంటాయి.  గత ఇన్‌ఫెక్షన్‌ నుంచి కొంత మేరకు రక్షణ లభిస్తుంది. డెల్టాకైతే 50-60 శాతం.. ఒమిక్రాన్‌కైతే 30 శాతం వరకూ మళ్లీ రాకుండా రక్షణ ఉంటుంది. రెండుడోసులు వ్యాక్సిన్‌ తీసుకొని, ఒకసారి కొవిడ్‌ బారినపడిన వారిలోనూ వచ్చే అవకాశాలున్నాయి. ఇటువంటి వారు కూడా బూస్టర్‌ వేసుకోవాలి. రెండోడోసు తీసుకున్న 6 నెలలకు బూస్టర్‌ డోసు తీసుకోవడం మంచిది. బూస్టర్‌తో ఒమిక్రాన్‌ నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.


ఒమిక్రాన్‌తో అంత ప్రమాదం లేదనే భావన ఉంది?

మిక్రాన్‌ను కూడా తేలిగ్గా తీసుకోవద్దు. లక్షల్లో కేసులు నమోదైనప్పుడు వేలల్లో బాధితులు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆసుపత్రిలో చేరికలు కూడా పెరిగే అవకాశాలుంటాయి. ఒమిక్రాన్‌ కారణంగా అసలు ఐసీయూలో చేరరు అనేది అపోహే. ఏఐజీలో ప్రస్తుతం అయిదుగురు ఒమిక్రాన్‌ వేరియంట్‌ బారినపడి ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. నలుగురు కోలుకుంటున్నారు. 80 ఏళ్లు దాటి, ఇతర దీర్ఘకాలిక సమస్యలున్న ఒకరి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. అందుకే మాస్కు తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. బూస్టర్‌ డోసు వేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని