కొత్త జన్యు కారకాల వల్లనే భారతీయుల్లో గుండె వైఫల్యం

భారతీయుల్లో గుండె వైఫల్యానికి సంబంధించి కొత్త జన్యు కారకాలను హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. డైలేటెడ్‌ కార్డియోమయోపతికి కారణమయ్యే బీటా మయోసిన్‌ హెవీ

Published : 18 Jan 2022 03:55 IST

గుర్తించిన సీఎస్‌ఐఆర్‌- సీసీఎంబీ శాస్త్రవేత్తల బృందం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: భారతీయుల్లో గుండె వైఫల్యానికి సంబంధించి కొత్త జన్యు కారకాలను హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. డైలేటెడ్‌ కార్డియోమయోపతికి కారణమయ్యే బీటా మయోసిన్‌ హెవీ చెయిన్‌(బీటాఎంవైహెచ్‌7) జన్యువులో నూతన ఉత్పరివర్తనాలను డాక్టర్‌ కె.తంగరాజ్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. తాజా పరిశోధన జన్యు లోపాన్ని సవరించేందుకు దోహదపడుతుందని, ఫలితంగా భవిష్యత్తులో భారతీయుల్లో గుండె వైఫల్య ముప్పు తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌ నందికూరి ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘అధ్యయనంలో భాగంగా 167 మంది ఆరోగ్యవంతులు, 137 మంది డైలేటెడ్‌ కార్డియోమయోపతి రోగుల బీటాఎంవైహెచ్‌7 జన్యువును విశ్లేషించి ఉత్పరివర్తనాలను గుర్తించామని’ సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింట్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ) డైరెక్టర్‌ కె తంగరాజ్‌ తెలిపారు. ‘ఈ అధ్యయనంలో మొత్తం 27 ఉత్పరివర్తనాలు వెల్లడయ్యాయి. వీటిలో ఏడు వినూత్నమైనవి. ఈ ఏడింటిని భారత డైలేటెడ్‌ కార్డియోమయోపతి రోగుల్లోనే గుర్తించాం. బీటాఎంవైహెచ్‌7 హోమాలజీ నమూనాలను ఉపయోగించి నిర్వహించిన మరో అధ్యయనంలో ఈ ఉత్పరివర్తనాలు కీలకమైన గుండె వ్యవస్థను ఎలా దెబ్బతీస్తాయో తొలిసారి నిరూపించామని’’ అధ్యయన శాస్త్రవేత్త డాక్టర్‌ దీపా సెల్విరాణి తెలిపారు. ఈ పరిశోధన వివరాలు ‘‘కెనడియన్‌ జర్నల్‌ ఆఫ్‌ కార్డియాలజీ- ఓపెన్‌’’లో జనవరి 14న ప్రచురితమయ్యాయి.

గుండె సంబంధ సమస్యల్లో కార్డియోమయోపతి ఒకటి. దీనివల్ల గుండె అంతర్నిర్మాణంలో మార్పులు వస్తాయి. ఫలితంగా గుండె రక్త ప్రసరణ చేయలేకపోతుంది. ఇది వ్యక్తి మరణానికి దారితీసే ప్రమాదముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని