ప్రాజెక్టుల అనుమతులను వేగవంతం చేయండి

మౌలిక వసతుల కల్పనలో సమయమే అత్యంత విలువైన పెట్టుబడి అని.. ఏ ప్రాజెక్టు అయినా నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయకపోతే దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల

Published : 18 Jan 2022 03:58 IST

భూ సేకరణపై సమీక్షలు నిర్వహిస్తుండండి
మౌలిక వసతుల కల్పనలో  సమయమే పెద్ద పెట్టుబడి
పీఎం గతిశక్తిపై దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

ఈనాడు-దిల్లీ, హైదరాబాద్‌: మౌలిక వసతుల కల్పనలో సమయమే అత్యంత విలువైన పెట్టుబడి అని.. ఏ ప్రాజెక్టు అయినా నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయకపోతే దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. సమయానికున్న కచ్చితమైన విలువను అధికారులు అర్థం చేసుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం పీఎం గతిశక్తి కార్యక్రమంపై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల సదస్సును ఉద్దేశించి గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. తెలంగాణ నుంచి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ‘‘పీఎం గతిశక్తి కార్యక్రమం వల్ల రాష్ట్రాల ఆదాయమూ పెరుగుతుంది. కేంద్రం ప్రతిపాదించే ప్రాజెక్టులకు సకాలంలో భూసేకరణ, పర్యావరణ అనుమతులు పూర్తి చేసేలా సీఎంలు చొరవ తీసుకోవాలి. భూసేకరణ విషయంలో రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులకు ఇబ్బంది లేదు. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా ముందుకు సాగి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు అయిదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిని సాధిద్దాం.

రాష్ట్రాలపై వివక్ష లేదు..

రాష్ట్రాల విషయంలో ఎలాంటి వివక్ష లేదు. బెంగళూరు-హైదరాబాద్‌ హైవేను 6 వరుసలుగా అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య ఇన్ఫర్మేషన్‌ సూపర్‌హైవే నిర్మాణం, హైదరాబాద్‌-విశాఖపట్నం మధ్య జాతీయ రహదారి అభివృద్ధి చేపడుతున్నాం. నాగ్‌పుర్‌-హైదరాబాద్‌ మధ్య గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఖమ్మం-దేవరపల్లి మధ్య ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తున్నాం. జహీరాబాద్‌ వద్ద ఇండస్ట్రియల్‌ నోడ్‌ ఏర్పాటు చేస్తున్నాం. నాగ్‌పుర్‌-విజయవాడ ఎకనమిక్‌ కారిడార్‌లో ఫార్మా సిటీని చేరుస్తున్నాం. రూ.17 వేల కోట్లతో ప్రాంతీయ రింగు రోడ్డును మంజూరు చేశాం. హైదరాబాద్‌ మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ నిర్మాణానికి డీపీఆర్‌ తయారీ ఇప్పటికే ప్రారంభమైంది.

20 హైవేల్లో విమానాల అత్యవసర ల్యాండింగ్‌ సౌకర్యం..

20 హైవేల్లో విమానాల అత్యవసర ల్యాండింగ్‌ సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నాం. దీనివల్ల ఈ రోడ్లను ఎయిర్‌పోర్టులు, హైవేలుగా ఉపయోగించడానికి వీలవుతుంది. రాష్ట్రాలు ఇక్కడ చిన్న విమానాశ్రయాలు అభివృద్ధి చేయొచ్చు. దేశవ్యాప్తంగా 30 చోట్ల మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌, అనంతపురం వద్ద వీటి ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు భూమి ఇస్తే.. ఈక్విటీ ఇస్తాం. పెట్టుబడి పెట్టి పార్కులను అభివృద్ధి చేస్తాం’’ అని గడ్కరీ పేర్కొన్నారు.


రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణపై చిన్నచూపు: కేటీఆర్‌

రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయటంలో తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోంది. 2014లో 1,733 కిలోమీటర్లు మంజూరు చేయగా.. 2021 నవంబరు వరకు అది 1,870 కిలోమీటర్లకు మాత్రమే పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ తరవాత తెలంగాణ ఉంది. ఆ జాబితాలో గుజరాత్‌ లేదని గమనించాలి. స్థూల జాతీయోత్పత్తిలో తెలంగాణది 5శాతం వాటా. ఈ గణాంకాలు ఆర్‌బీఐ వెలువరించినవే. తెలంగాణలో డ్రైపోర్టులతోపాటు పోర్టులకు అనుసంధానతను మరింత బలోపేతం చేయాలి. హైదరాబాద్‌కు రావాల్సిన డిఫెన్స్‌ కారిడార్‌ను బుందేల్‌ఖండ్‌కు ఏ కారణంతో తీసుకెళ్లారో కేంద్రానికే తెలియాలి. జాతీయస్థాయి ప్రాజెక్టుల మంజూరు జాబితాను చూస్తే హైదరాబాద్‌ అంతగా కనిపించటం లేదు. హైదరాబాద్‌కు ప్రాంతీయ రింగు రోడ్డుకు భూసేకరణను వేగవంతం చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని