ఏబీసీ విధానానికి కేంద్ర విద్యాశాఖ శ్రీకారం..

అమెరికాలో మాదిరిగా విద్యార్థులు చదువు మధ్యలో ఒక విద్యా సంస్థ నుంచి మరొక విద్యా సంస్థకు మారేందుకు స్వేచ్ఛ ఇచ్చే అకడమిక్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ (ఏబీసీ) విధానానికి కేంద్ర విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. 2021 విశ్వవిద్యాలయ నిధుల సంఘం

Published : 18 Jan 2022 04:16 IST

వర్సిటీయే కాకుండా కోర్సు మారేందుకూ విద్యార్థులకు వెసులుబాటు
విశ్వవిద్యాలయాలు, అధ్యాపకుల పాత్ర తగ్గించేందుకేనని విమర్శలు

దిల్లీ: అమెరికాలో మాదిరిగా విద్యార్థులు చదువు మధ్యలో ఒక విద్యా సంస్థ నుంచి మరొక విద్యా సంస్థకు మారేందుకు స్వేచ్ఛ ఇచ్చే అకడమిక్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ (ఏబీసీ) విధానానికి కేంద్ర విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. 2021 విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) నిబంధనల ప్రకారం ఏ విశ్వవిద్యాలయమైనా, ఏ కళాశాల అయినా ఏబీసీ చట్రంలో నమోదు కావచ్చు. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, స్వయంప్రతిపత్తి విద్యా సంస్థలకు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ఉన్నత విద్యా సంస్థలను ఏబీసీ పరిధిలోకి తెచ్చారు. విద్యార్థులు సంపాదించిన క్రెడిట్లను ఉన్నత విద్యా సంస్థలు ఒక డిజిటల్‌ నిధిలో భద్రపరచడాన్ని ఏబీసీ విధానంగా వ్యవహరిస్తారు. విద్యార్థి ఒక వర్సిటీ నుంచి మరొక వర్సిటికే కాకుండా.. ఒక కోర్సు నుంచి మరో కోర్సుకూ మారడానికి ఈ విధానం వెసులుబాటు కల్పిస్తుంది. విద్యార్థులు ఆన్‌ లైన్‌లో కూడా అభ్యసనం చేసి క్రెడిట్లు సంపాదించవచ్చు. వాటిని కూడా ఏబీసీలో పొందుపరుస్తారు. యూజీసీ నిరుడు జులైలోనే ఏబీసీ విధానాన్ని నోటిఫై చేసింది. జాతీయ మూల్యాంకన, ధ్రువీకరణ మండలి (నాక్‌)లో ఏ గ్రేడు పొందిన లేదా 100 అగ్రశ్రేణి జాతీయ సంస్థల ర్యాంకింగ్‌ చట్రం (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో స్థానం సంపాదించిన ఉన్నత విద్యా సంస్థలన్నీ తప్పనిసరిగా ఏబీసీలో నమోదు కావాలని యూజీసీ నిబంధనలు స్పష్టం చేశాయి. తాజా నిబంధనల ప్రకారం ఏ విశ్వవిద్యాలయమైనా, ఏ కళాశాల అయినా ర్యాంకులతో నిమిత్తం లేకుండా ఏబీసీలో చేరవచ్చు. ఇప్పటికే 40 కేంద్ర విశ్వవిద్యాలయాలు ఏబీసీ విధానంలోకి మారాయి. కాగా ఏబీసీ విధానం వల్ల విశ్వవిద్యాలయాల, అధ్యాపకుల పాత్ర తగ్గిపోతుందని విమర్శలు వస్తున్నాయి. అధ్యాపకుల జీతాల ఖర్చు తగ్గించడానికీ, ప్రభుత్వ వర్సిటీల నిధుల్లో కోత వేయడానికీ ఏబీసీ దారితీస్తుందని.. విద్యార్థులను ఆన్‌లైన్‌ విద్యవైపు నెట్టే ఎత్తుగడ ఇదనీ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని