భారీ వర్షాలతో నీట మునిగిన ‘సీతమ్మ సాగర్‌’

ఎగువన భారీవర్షాలతో గోదావరిలో ప్రవాహం పెరగటంతో భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు కాంక్రీటు నిర్మాణ పనులకు సోమవారం తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది.

Published : 18 Jan 2022 04:21 IST

నిలిచిన ప్రాజెక్టు పనులు
గోదారిలో అనూహ్య ప్రవాహం
కాఫర్‌డ్యాంకు పలుచోట్ల గండి

దుమ్ముగూడెం ఆనకట్ట దిగువన నీట మునిగిన సీతమ్మ సాగర్‌ మట్టికట్ట, కాంక్రీటు నిర్మాణ బ్లాకులు

అశ్వాపురం, న్యూస్‌టుడే: ఎగువన భారీవర్షాలతో గోదావరిలో ప్రవాహం పెరగటంతో భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు కాంక్రీటు నిర్మాణ పనులకు సోమవారం తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. పొరుగున ఛత్తీస్‌గఢ్‌, ఎగువన కరీంనగర్‌ జిల్లాల్లో కురిసిన జడివానలకు ఆదివారం రాత్రి నదిలో వరద ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అశ్వాపురం నుంచి దుమ్ముగూడెం వరకు గోదావరిలో కిలోమీటరు పొడవున నిర్మించిన సీతమ్మ సాగర్‌ కాఫర్‌డ్యాంకు పలుచోట్ల గండిపడింది. 1, 2, 3 బ్లాకుల్లో పునాదుల తవ్వకం పనులు, 5, 6 బ్లాకుల్లో కాంక్రీటు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ బ్లాకులు వరద ప్రవాహంలో మునిగిపోయాయి. వరద ఉద్ధృతిని గమనించిన అధికారులు నిర్మాణ ప్రదేశాల్లో ఉన్న భారీ యంత్రాలను, పరికరాలను ఆదివారం రాత్రికి రాత్రే గోదావరి ఒడ్డుకు తరలించారు. కాగా ప్రాజెక్టు మట్టికట్ట(ఎర్త్‌ డ్యాం) కొట్టుకుపోవటం ఇది రెండోసారి. వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోందని, రెండు మూడు రోజుల్లో పనులు తిరిగి ప్రారంభమయ్యేలా చూస్తామని సీతమ్మ సాగర్‌ ఎస్‌ఈ వెంకటేశ్వరరెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని