మహిళా వర్సిటీ ఏర్పాటుపై ప్రతిపాదనలివ్వండి

త్వరలోనే వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు

Published : 19 Jan 2022 03:07 IST

అధికారులకు విద్యామంత్రి సబిత ఆదేశం
రాణీ రుద్రమదేవి లేదా తెలంగాణ రాష్ట్ర మహిళా వర్సిటీ అనే పేర్లపై చర్చ

సమీక్షిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చిత్రంలో లింబాద్రి, పార్థసారథి, వెంకటరమణ, విజులత, జలీల్‌, నవీన్‌ మిత్తల్‌

ఈనాడు, హైదరాబాద్‌: త్వరలోనే వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా వర్సిటీపై మంగళవారం మంత్రి తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. కళాశాలను వర్సిటీగా మారిస్తే అవసరమయ్యే బోధనా సౌకర్యాలు, మౌలిక వసతులు, ఆధునిక కోర్సులు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి నివేదిక అందజేయాలని కోరారు. అంతర్గతంగా ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని విధివిధానాలు, అనుమతులు తదితరాలపై వివరాలు సమర్పించాలన్నారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వర్సిటీకి రాణీ రుద్రమదేవి లేదా తెలంగాణ స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఉమెన్‌ (టీఎస్‌యూడబ్ల్యూ) అనే పేర్లపై చర్చించినట్లు సమాచారం. కళాశాల 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నందున బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కళాశాలను గురువారం అధికారులు సందర్శించనున్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఉపాధ్యక్షుడు వి.వెంకటరమణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌, విద్యా సంక్షేమ మౌలికాభివృద్ధి సంస్థ ఎండీ పార్థసారథి, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ విజులత తదితరులు పాల్గొన్నారు.

పైలట్‌ ప్రాజెక్టు కింద 4 పాఠశాలలు
‘మన ఊరు- మన బడి’ పథకం కింద పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో పనులు చేపట్టినట్లు విద్యామంత్రి సబిత తెలిపారు. అందులో రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, హైదరాబాద్‌ జిల్లాలోని ఆలియా, మహబూబియా(బాలికలు) ఉన్నత, ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి  రూ.3.57 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సంబంధిత పనుల పురోగతిపై తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలికాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) అధికారులతో మంత్రి సమీక్షించారు. సమావేశంలో ఛైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, ఎండీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని