సచివాలయంలో కరోనా కలకలం

ప్రభుత్వ శాఖల్లో కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్ర  సచివాలయం(బీఆర్కే భవన్‌)లోనే పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులు కొవిడ్‌ బారినపడ్డారు. ఐఏఎస్‌ అధికారులతో పాటు సాధారణ పరిపాలన, రవాణా, వైద్యారోగ్య

Published : 19 Jan 2022 03:28 IST

అయిదుగురు ఐఏఎస్‌లు సహా 30 మందికి వైరస్‌
పోలీసుశాఖలో భారీగా బాధితులు
వివిధ శాఖల్లోనూ అదే పరిస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్ర  సచివాలయం(బీఆర్కే భవన్‌)లోనే పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులు కొవిడ్‌ బారినపడ్డారు. ఐఏఎస్‌ అధికారులతో పాటు సాధారణ పరిపాలన, రవాణా, వైద్యారోగ్య, రెవెన్యూ, విద్యాశాఖలోని అధికారులు, ఉద్యోగులు 30 మందికి వైరస్‌ సోకింది. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, రవాణా, రోడ్లు భవనాల కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్విలతో పాటు ఆర్థికశాఖ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ శివశంకర్‌లకు పాజిటివ్‌ తేలింది. ఇప్పటికే జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. సచివాలయంలో కరోనా కేసులు అధికమవుతుండడంతో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మహమ్మారి బారినపడ్డ వారంతా సెలవుపై వెళ్తుండటం, క్వారంటైన్‌ పూర్తయ్యే వరకూ విధులకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో దైనందిన కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

పోలీసుశాఖ విలవిల
పోలీసుశాఖ కరోనాతో విలవిలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది పోలీసులు కొవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో 150, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఓ డీఐజీ స్థాయి అధికారితో పాటు దాదాపు 300, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లలో 350 మంది వరకూ వైరస్‌ బారినపడ్డారు. వరంగల్‌ కమిషనరేట్లో ముగ్గురు ఏసీపీలు, నలుగురు సీఐలతో సహా 99 మంది, రామగుండం పోలీసు కమిషనరేట్లో ఓ ఏసీపీ, ఇద్దరు సీఐలతో సహా 68 మంది, వివిధ జిల్లాలో పదుల సంఖ్యలో పోలీసులకు పాజిటివ్‌ తేలింది. బాధితులకు ఆసరాగా రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లలో సహాయక నంబర్లు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా సిబ్బందికి కరోనా సోకే ప్రమాదం ఉందని అధికారులు ఆ ప్రక్రియను నిలిపివేశారు.

ఇతర శాఖల్లో..
పోలీసుశాఖ తర్వాత ఎక్కువ మంది బాధితులైంది ఆరోగ్యశాఖలోనే.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైద్యులతో పాటు వైద్య విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది భారీగా దీని బారిన పడ్డారు. మంగళవారం ప్రజారోగ్య సంచాలకుడికీ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. విద్యాశాఖలోనూ అనేక మందికి కరోనా సోకింది. శాఖ కార్యదర్శి సుల్తానియాతో పాటు ఇంటర్‌బోర్డు, ఇంటర్‌ విద్యాశాఖలో 15 మంది మహమ్మారి బారినపడ్డారు. క్షేత్రస్థాయిలో పదుల సంఖ్యలో టీచర్లకు పాజిటివ్‌గా తేలింది. ఎస్‌పీడీసీఎల్‌లో ఫైనాన్స్‌ సంచాలకులు సహా 75 మంది, ట్రాన్స్‌కోలో 22, వ్యవసాయ కమిషనరేట్‌లో 10 మంది, ఉద్యాన కమిషనరేట్లో ఇద్దరు మహమ్మారి బారినపడ్డారు. సింగరేణిలో ఉద్యోగులు, కుటుంబ సభ్యులు కలిపి 951 మంది, నీటిపారుదలశాఖలో పదిమంది ఇంజినీర్లు కొవిడ్‌తో బాధ పడుతున్నారు.

ఎమ్మెల్యే గండ్ర దంపతులకు పాజిటివ్‌
ఈనాడు, వరంగల్‌: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య వరంగల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ జ్యోతికి కరోనా సోకింది. మిర్చి పంట నష్టాన్ని పరిశీలించేందుకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి  జిల్లాలో పర్యటించగా.. వెంట వీరూ ఉన్నారు. వెంకటరమణారెడ్డి.. మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటే హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ వెళ్లారు. సాయంత్రం గండ్ర దంపతులకు జ్వరం రావడంతో పరీక్షించుకోగా కొవిడ్‌గా తేలింది.


ఒక్కరోజులోనే 2,983 పాజిటివ్‌లు
7 నెలల తర్వాత ఇదే అత్యధికం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మూడోదశ ఉద్ధృతి ప్రారంభమైన తర్వాత మంగళవారం అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 2,983 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. 7 నెలల తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,14,639కి పెరిగింది. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు కొవిడ్‌ బారినపడ్డారు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. స్వల్ప లక్షణాలున్నాయని, ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఒకేరోజులో లక్ష దాటిన పరీక్షలు
మహమ్మారి కోరల్లో చిక్కి మరో ఇద్దరు మరణించడంతో ఇప్పటి వరకూ 4,062 మంది కన్నుమూశారు. తాజాగా 2,706 మంది చికిత్స పొంది కోలుకోగా మొత్తంగా 6,88,105 మంది ఆరోగ్యవంతులయ్యారు. వైరస్‌ బారిన పడి ప్రస్తుతం రాష్ట్రంలో 22,472 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,07,904 నమూనాలను పరీక్షించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,08,17,562కు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా జీహెచ్‌ఎంసీలో మాత్రం అనూహ్యంగా అధికమవుతున్నాయి. తాజాగా ఇక్కడ 1,206 కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లోనూ వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డిలో 227, హనుమకొండలో 118, సంగారెడ్డిలో 96, పెద్దపల్లిలో 81, ఖమ్మంలో 77, నిజామాబాద్‌లో 76, మంచిర్యాలలో 75, భద్రాద్రి కొత్తగూడెంలో 65, నల్గొండలో 61, వికారాబాద్‌లో 50 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. జగిత్యాల, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, మెదక్‌, నాగర్‌కర్నూల్‌, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో మరో 2,93,843 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు.  15-17 ఏళ్ల మధ్యవయస్కుల్లో ఇప్పటి వరకూ 9,63,864(అర్హుల్లో 52 శాతం) మంది టీకాలను పొందారు.

* భూపాలపల్లి సింగరేణి ఏరియాలో మంగళవారం 100 మందికి పరీక్షలు చేయగా 57 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సింగరేణి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పద్మజ తెలిపారు. వీరిలో తనతో పాటు మరో నలుగురు సిబ్బంది, కార్మికులు కూడా ఉన్నారన్నారు.

* ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో మరో అయిదుగురు రోగులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆసుపత్రిలో వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 71కి చేరింది.  


ఏపీలో కొత్తగా 6,996 మందికి వైరస్‌  

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి పండగకు చాలా మంది సొంతూర్లకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా జరిగినందువల్లే కేసులు అధిక సంఖ్యలో బయటపడుతున్నాయి. సోమవారం 4,018 (17.95%) కేసులు నమోదయ్యాయి. 24 గంటలు గడిచేసరికి కొత్త కేసులు 7 వేలకు చేరువలో రావడం ఆందోళన కలిగిస్తోంది.  పాజిటివిటీ రేటు 22.67%గా చేరుకుంది.


చంద్రబాబుకు కరోనా

తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేస్తూ మంగళవారం ట్వీట్‌ చేశారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించారు. తనను కలిసిన వారు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతా సురక్షితంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, ఆ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం వైఎస్‌ జగన్‌లు ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు