అంచనా వేశాకే..అనుసంధానం

నీటి లభ్యత అంచనా వేసిన తర్వాతే గోదావరి-కావేరి అనుసంధానంపై ముందుకెళ్లాలని రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి సూచించాయి. తమ అవసరాలకుపోను మిగులు ఉంటే అభ్యంతరం లేదని తెలిపాయి. మొదట ఎంత నీరుందో తేల్చాలని కోరాయి.

Published : 20 Jan 2022 04:35 IST

గోదావరి-కావేరిపై తెలుగు రాష్ట్రాల సూచన
మిగులు జలాలుంటే అభ్యంతరం లేదని ప్రకటన

ఈనాడు హైదరాబాద్‌: నీటి లభ్యత అంచనా వేసిన తర్వాతే గోదావరి-కావేరి అనుసంధానంపై ముందుకెళ్లాలని రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి సూచించాయి. తమ అవసరాలకుపోను మిగులు ఉంటే అభ్యంతరం లేదని తెలిపాయి. మొదట ఎంత నీరుందో తేల్చాలని కోరాయి. జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌.డబ్ల్యు.డి.ఎ) 69వ సమావేశం బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి పంకజ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని రాష్ట్రాల అధికారులు, కేంద్ర జలసంఘం, కేంద్ర విద్యుత్తు అథారిటీ సహా పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  ఈ సమావేశంలో నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. నాలుగింటిపై ప్రధానంగా చర్చించగా వీటిలో గోదావరి (ఇచ్చంపల్లి)- కావేరి (గ్రాండ్‌ఆనకట్ట) ముఖ్యమైంది. తెలంగాణ నుంచి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, అంతర్‌రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ మోహన్‌కుమార్‌, ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి పాల్గొన్నారు. నీటి లభ్యతపై సందేహాలున్నందున మొదట ఈ అంశంపై అధ్యయనం చేయించాలని, మొత్తం వినియోగం తర్వాత నీటి లభ్యత ఎంతో తేల్చాలని మురళీధర్‌ సూచించారు. కేంద్ర జలసంఘం, జాతీయ జల అభివృద్ధి సంస్థ, వాప్కోస్‌ ఇలా ఒక్కో సంస్థ నివేదికలో ఒక్కోరకంగా నీటి లభ్యత ఉందని, మొదట నీటి లభ్యతను తేల్చాలని జవహర్‌రెడ్డి కోరారు. కాళేశ్వరం డీపీఆర్‌లో పేర్కొన్న నీటి లభ్యతకు, సీతారామ ఎత్తిపోతలలో పేర్కొన్నదానికి తేడాలున్నాయని, 75 శాతం నీటిలభ్యత పోనూ మిగిలిన నీటిలో దిగువన ఉన్న రాష్ట్రంగా తమకు వినియోగించుకొనే హక్కు ఉందని, తమ అవసరాలు పోగా మిగిలితేనే చేపట్టాలన్నారు. గోదావరి-కావేరి ద్వారా మళ్లించే నీటిని నిల్వ చేయడానికి, వినియోగించుకోవడానికి నాగార్జునసాగర్‌, సోమశిల అందుబాటులో ఉండవని, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. దీనిపై నేరుగా సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని ప్రతిపాదించారు. ఈ అనుసంధానంలో తమ వాటా ఎంతో తేల్చాలని కర్ణాటక డిమాండ్‌ చేయగా, త్వరగా పథకాన్ని పూర్తి చేయాలని తమిళనాడు కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని