పురుషుల్లో మార్పుతోనే మహిళలకు రక్షణ

సమాజంలో పురుషుల్లో మార్పు వచ్చినపుడే మహిళలకు రక్షణ ఉంటుందని మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్‌, భరోసా కేంద్రాల ఏర్పాటుతో పాటు అనేక చర్యలు తీసుకుంటున్నా అక్కడక్కడ జరుగుతున్న

Published : 20 Jan 2022 05:06 IST

బాధితులకు కమిషన్‌ భరోసా ఇవ్వాలి
మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: సమాజంలో పురుషుల్లో మార్పు వచ్చినపుడే మహిళలకు రక్షణ ఉంటుందని మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్‌, భరోసా కేంద్రాల ఏర్పాటుతో పాటు అనేక చర్యలు తీసుకుంటున్నా అక్కడక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. మహిళా కమిషన్‌ ఏర్పాటై ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులతో కలిసి వార్షిక నివేదిక, మహిళల భద్రతపై రూపొందించిన పాటల సీడీని బుధవారం ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితులు కమిషన్‌కు వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం కలిగేలా సేవలు అందించాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని ముఖ్యమంత్రిని కోరగా ఒప్పుకుని వెంటనే సమగ్ర నివేదికకు ఆదేశించారన్నారు.

70% కేసులు పరిష్కరించాం: సునీతాలక్ష్మారెడ్డి

ఏడాదిలోనే దాదాపు 70 శాతం కేసులను పరిష్కరించామని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఏడాదిలో 10 వెబినార్‌ సదస్సులు నిర్వహించి 333 కేసులను పరిష్కరించామన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను నిరోధించేందుకు స్థానిక కమిటీలను జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. కమిషన్‌కు వచ్చే ఫిర్యాదులో వ్యక్తిగత వివరాల గోప్యత పాటిస్తున్నామని, బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేయాల్సిన కేసులు ఉన్నపుడు ఒకసారి కమిషన్‌ను సంప్రదించి న్యాయ సహాయం తీసుకోవాలని కోరారు.  

గృహహింస, వరకట్న వేధింపులే ఎక్కువ

రాష్ట్రంలో మహిళా కమిషన్‌కు వచ్చిన మొత్తం 492 కేసుల్లో వరకట్నం, గృహహింస కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఏడాదిలోనే 302 మంది బాధితులు న్యాయం కోసం కమిషన్‌ను ఆశ్రయించారు. కట్నకానుకలు ఇవ్వలేదని, అదనపు కట్నం కావాలంటూ భర్త, అత్తింట్లో వేధింపులు పెరుగుతున్నాయి. కుటుంబ సంబంధ సమస్యలతో 50 జంటలు ఆశ్రయించగా కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇప్పటికే 30 జంటలు కలిసి జీవించేలా చర్యలు తీసుకున్నట్లు కమిషన్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని