ఇంటింటా జ్వర సర్వే

తేలికపాటి జ్వరం, దగ్గు, ఆయాసం ఉంటే.. ఆరోగ్య ఉపకేంద్రానికి గానీ.. సమీపంలోని ఆసుపత్రులకుగానీ వెళ్లాలి. హోం ఐసొలేషన్‌ కిట్లు వాడడం ద్వారా 99 శాతం మందిలో కరోనా తగ్గుతుంది.

Published : 21 Jan 2022 02:43 IST

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించనున్న వైద్య సిబ్బంది

లక్షణాలున్న వారికి అప్పటికప్పుడే ఔషధ కిట్లు అందజేత

కోటి కిట్లు సిద్ధమన్న మంత్రి హరీశ్‌రావు

కిట్‌లో ఔషధాలను ఎలా వాడుకోవాలో సూచించే కరపత్రాన్ని చూపిస్తున్న హరీశ్‌రావు

తేలికపాటి జ్వరం, దగ్గు, ఆయాసం ఉంటే.. ఆరోగ్య ఉపకేంద్రానికి గానీ.. సమీపంలోని ఆసుపత్రులకుగానీ వెళ్లాలి. హోం ఐసొలేషన్‌ కిట్లు వాడడం ద్వారా 99 శాతం మందిలో కరోనా తగ్గుతుంది. ఎవరికైనా తీవ్రమైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఏఎన్‌ఎంలకు ఆదేశాలిచ్చాం. వెంటిలేటర్లను జిల్లా, ఏరియా ఆసుపత్రుల స్థాయికి తీసుకెళ్లాం. చిన్న పిల్లల కోసం అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు, వెంటిలేటర్లు ఏర్పాట్లు చేశాం. వారికి సంబంధించిన మందులు  ఉన్నాయి. అన్ని స్థాయుల ప్రభుత్వ వైద్యశాలల్లో నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఎవరూ ప్రైవేటుకు వెళ్లొద్దు.

- మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరోసారి ఇంటింటి జ్వర సర్వే శుక్రవారం నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రెండోదశ ఉద్ధృతి సమయంలో నిర్వహించిన అనుభవం ఉండడంతో.. ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించింది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర లక్షణాలున్న వారికి ఎక్కడికక్కడే హోం ఐసొలేషన్‌ కిట్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కోటి ఔషధ కిట్లను అన్ని ఆసుపత్రులకు పంపించారు. ఇంటి వద్దనే చికిత్స పొందుతున్న వారిని వైద్యసిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ లక్షణాలు తీవ్రమైతే.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్‌ టి.గంగాధర్‌, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఆ సంస్థ ఎండీ చంద్రశేఖరరెడ్డిలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పురపాలక, పంచాయతీరాజ్‌, వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ముఖ్యాంశాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఇతర శాఖల సమన్వయంతో

‘‘రాష్ట్రంలో రెండోదశ కొవిడ్‌ ఉద్ధృతిలో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే, హోం ఐసొలేషన్‌ కిట్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. నీతిఆయోగ్‌, ఎకనామిక్‌ సర్వే రిపోర్టు కూడా ప్రశంసించాయి. ఇదే స్ఫూర్తితో వైద్య, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో ఈ సర్వే కూడా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ‘‘అవ్వా పాణం ఎట్టుందే..ఓ పెద్దమనీషీ ఆరోగ్యం మంచిగుందా’’ అంటూ వైద్య సిబ్బంది ఇల్లిల్లూ తిరుగుతారు. వివరాలు సేకరిస్తారు. అవసరమైన వారికి ఔషధ కిట్లు, మందులు ఎలా వాడుకోవాలో సూచించే కరపత్రం ఇస్తారు. అందుకోసం రాష్ట్రంలో రెండు కోట్ల నిర్ధారణ పరీక్షల కిట్లను, కోటి హోం ఐసొలేషన్‌ కిట్లను సిద్ధం చేశాం. వాస్తవానికి ప్రస్తుతం టెస్టింగ్‌ కిట్లు మార్కెట్లో పెద్దగా లేవు. పైగా ధరలు పెరిగాయి. హోం ఐసొలేషన్‌ కిట్లలో ఉండాల్సిన మందులు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో పూర్తిస్థాయిలో వీటిని సమకూర్చుకుంది.ప్రజల వద్దకే ఆరోగ్య అధికారులు వెళ్లి మందులు ఇస్తారు. అన్ని రాష్ట్రాలు కూడా మనం అనుసరిస్తున్న పద్ధతిని పాటించాలని కేంద్రం సూచించింది. 

ఆదివారాలు కూడా సేవలు

కరోనా తీవ్రత దృష్ట్యా ఆదివారాలు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకూ బస్తీ దవాఖానాల్లో సేవలు లభ్యమవుతాయి. ఎంతమంది వస్తే అంతమందికీ పరీక్షలు చేయాలని ఆదేశాలిచ్చాం. వాస్తవానికి వ్యాధి లక్షణాలున్న వారికే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్‌ సూచించింది. వారికే చికిత్సలు చేయాలని స్పష్టం చేసింది. శాసనసభ్యులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా జ్వర సర్వేలో పాల్గొనాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలకూ ప్రాణవాయువు సౌకర్యం కల్పించాం. 76 ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ స్వీయ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాం. ఇప్పటికే 340 మెట్రిక్‌ టన్నులకు ఆక్సిజన్‌ సామర్థ్యం పెరిగింది. 500 మెట్రిక్‌ టన్నుల వరకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.  ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 56 వేల కొవిడ్‌ పడకలుండగా ఒక్క శాతం వినియోగంలో ఉన్నాయి.

ప్రైవేటులో అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు

ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షకు ప్రభుత్వం నిర్ణయించిన ధర (ఆర్‌టీపీసీఆర్‌కు రూ.500)కంటే ఎక్కువ వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా నేపథ్యంలో మేడారం జాతరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. వ్యాక్సినేషన్‌ కాలపరిమితిని తగ్గించాలని, అందరికీ బూస్టర్‌ డోసు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. బూస్టర్‌ డోస్‌కు 9 నెలల కాలపరిమితి వల్ల సమస్య వస్తోంది. రాష్ట్రంలో తొలిడోసు వంద శాతం పూర్తయింది. కానీ కాలపరిమితి ఎక్కువగా ఉండటంతో రెండోడోసు పూర్తి కాలేదు’’ అని మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని