పీపీపీ ఒప్పందాలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టుల అద్దెలు, ఆదాయ వాటా ఇవ్వని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను పర్యాటకశాఖ మంత్రి

Updated : 21 Jan 2022 06:13 IST

అధికారులకు పర్యాటకశాఖ మంత్రి ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టుల అద్దెలు, ఆదాయ వాటా ఇవ్వని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. ఒప్పంద నిబంధనల మేరకు చర్యలు తీసుకుని వాటికి తాగునీటి పంపిణీ, విద్యుత్తు సరఫరా నిలిపి వేయాలని సూచించారు. గురువారమిక్కడ పీపీపీ ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వాలు పీపీపీ విధానంలో వివిధ సంస్థలకు భూములు కేటాయించి ప్రాజెక్టులు చేపట్టగా.. వాటిలో కొన్ని సంస్థలు కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహిస్తుంటే, మరికొన్ని చిన్న కారణాలతో న్యాయ వివాదాలు సృష్టించి కాలయాపన చేస్త్తున్నాయన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అద్దె, ఆదాయ వాటా చెల్లించకుండా కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నాయని వివరించారు. లీజు ఒప్పందాల్ని ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సంస్థల నుంచి బకాయిలు వెంటనే వసూలు చేయాలని, అవసరమైతే సీఎంతో చర్చించి లీజు యజమానులతో తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌, పర్యాటక శాఖ కార్యదర్శి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని