మళ్లీ కేసుల వరద

దేశంలో కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి ఆందోళనకరరీతిలో పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య గురువారం 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లో (బుధవారం ఉ. 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల

Published : 21 Jan 2022 04:50 IST

24 గంటల్లో 3,17,532 మందికి కొవిడ్‌-19

దిల్లీ: దేశంలో కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి ఆందోళనకరరీతిలో పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య గురువారం 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లో (బుధవారం ఉ. 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు) కొత్తగా 3,17,532 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. 491 మంది కరోనాతో మృతి చెందారు. గత 249 రోజుల్లో ఇంత భారీ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.82 కోట్లు దాటగా.. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 9,287కి పెరిగింది. ఒక్కరోజులో 93,051 క్రియాశీలక కేసులు పెరగడంతో వాటి మొత్తం సంఖ్య 19,24,051 (5.03%)కి, మరణాల సంఖ్య 4,87,693కు చేరింది.

ఐదేళ్ల లోపు వారికి మాస్కులొద్దు!

దిల్లీ: ఐదేళ్లు.. ఆ లోపు వయసు పిల్లలకు మాస్కులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు 18 ఏళ్ల లోపు పిల్లలకు మందులు, మాస్కుల వినియోగానికి సంబంధించి కేంద్రం గురువారం సవరించిన కొవిడ్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నప్పటికీ.. ఈ వయసు వారికి యాంటీవైరల్స్‌ లేదా మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ను సిఫార్సు చేయడం లేదని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఒకవేళ స్టెరాయిడ్స్‌ వాడితే.. ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా 10-14 రోజుల్లో వాటిని క్రమేపీ తగ్గించేయాలని పేర్కొంది. తాజాగా కొవిడ్‌ కేసులు అమాంతం పెరుగుతుండటంతో పాటు, ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మార్గదర్శకాలను నిపుణుల బృందం సమీక్షించింది. ఈమేరకు సవరించిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. 6-11 ఏళ్ల పిల్లలకు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాస్కులు వాడొచ్చు. పిల్లలు మాస్కులు ధరించగలుగుతున్నారా? అవి సురక్షితమేనా? వంటి అంశాలను పరిశీలించాలి. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు మాత్రం పెద్దల మాదిరిగానే మాస్కులు వాడొచ్చు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కేసుల్లో చికిత్సకు యాంటీబయోటిక్స్‌ వాడొద్దని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒక మాదిరి లేదా తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లోనూ నిర్దేశించిన పరిస్థితుల్లో తప్ప వీటిని వాడరాదని స్పష్టం చేసింది. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కేసులకు సంబంధించి స్టెరాయిడ్లు కూడా వాడొద్దని పేర్కొంది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే.. అదీ నిపుణుల కీలక పర్యవేక్షణలోనే వీటిని వాడాలని తెలిపింది. సరైన సమయంలో, తగినంత డోసులో, తగినంత కాల వ్యవధిలో మాత్రమే స్టెరాయిడ్లు వినియోగించాలని పేర్కొంది. ఈ మేరకు 5-7 రోజుల వరకు వాటిని కొనసాగించాలని తెలిపింది. తొలి 3-5 రోజుల వరకు మాత్రం వాడొద్దని స్పష్టం చేసింది. కొవిడ్‌ బారిన పడిన పిల్లల్లో లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న వారికి సాధారణ సంరక్షణ కల్పించాలని, అర్హులైనవారికి టీకాలు వేయించాలని కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా వారి సంరక్షణకు సంబంధించిన పలు విధివిధానాలను వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని