ఏపీ ఉద్యోగుల సమ్మె సైరన్‌

వేతన సవరణ (పీఆర్సీ)పై ఏపీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించాయి. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం నుంచి వివిధ రూపాల్లో

Published : 22 Jan 2022 03:12 IST

ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి

23న సీఎస్‌కు నోటీసు అందజేత

ఈనాడు, అమరావతి: వేతన సవరణ (పీఆర్సీ)పై ఏపీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించాయి. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌శర్మకు సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కొక్కటిగా ఉన్న నాలుగు ఐకాసలు కలిపి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. ఏపీ ఐకాస, ఐకాస అమరాతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉమ్మడి వేదికపైకి వచ్చాయి. ఉద్యోగసంఘాలు శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిపాయి. మొదట ఉదయం ఎన్జీవో హోంలో ఐకాసలు సమావేశమై మధ్యాహ్నం వరకు సమ్మె, ఉద్యమ కార్యాచరణపై చర్చించాయి. మధ్యాహ్నం నుంచి నాలుగు ఐకాసలు కలిసి సచివాలయంలో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ రూపొందించాయి. సమావేశం అనంతరం ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎస్‌ సమీర్‌శర్మను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కొత్త జీతాల బిల్లులు చేయాలని డీడీఓలపై ఒత్తిడి చేయొద్దని, పాత జీతాలే ఇవ్వాలని కోరారు. పీఆర్సీ ఉత్తర్వులు ఆపాలని విన్నవించారు. సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కోరారు.


ఉద్యమ కార్యాచరణ ఇలా...

జనవరి 23: అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు  
జనవరి 24: సీఎస్‌కు సమ్మె నోటీసు
జనవరి 25: అన్ని జిల్లాకేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు. సచివాలయంలో ప్రత్యేకంగా నిరసన
జనవరి 26: అంబేడ్కర్‌ విగ్రహానికి అన్నిచోట్లా వినతిపత్రాలు  
జనవరి 27 నుంచి 30 వరకు: అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్షలు
ఫిబ్రవరి 3: చలో విజయవాడ
ఫిబ్రవరి 5: అన్ని ప్రభుత్వ విభాగాల్లోని సిబ్బంది సహాయ నిరాకరణ.
ఫిబ్రవరి 7: ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని