KTR: స్పందించకపోతే కేంద్రంపై పోరాటమే

రాష్ట్రంలోని నేతన్నలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతోందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలోని లక్షలాది నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రాన్ని పలు పథకాలు మంజూరు చేయాలని కోరుతున్నా

Updated : 22 Jan 2022 06:34 IST

నేతన్నలపై సవతి ప్రేమ చూపుతోంది
వారి కోసం మరోసారి లేఖలు రాస్తున్నా
సంజయ్‌కు కూడా పంపుతున్నా
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాష్ట్రంలోని నేతన్నలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతోందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలోని లక్షలాది నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రాన్ని పలు పథకాలు మంజూరు చేయాలని కోరుతున్నా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘లేఖల ద్వారా, స్వయంగా కలిసి వినతులు అందిస్తున్నాం. ఏడేళ్లుగా కేంద్రం నుంచి ఉలుకూ... పలుకూ లేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉన్నా’’మని మంత్రి తెలిపారు. ‘అయిననూ పోయిరావలే హస్తినకు’ అన్నట్లుగా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎనిమిదోసారి కేంద్ర మంత్రులకు పలు అంశాలపై సవివరంగా లేఖలు పంపుతున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా పంపుతున్నట్లు తెలిపారు. ‘‘కేంద్రం స్పందించకపోతే ఏం చేయాలనేది కూడా ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలోని నేతన్నలతో సమావేశమై ఏరకంగా కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతుందో వారికి అర్థమయ్యేలా వివరిస్తాం. పోరాటానికి సిద్ధమవుతాం. ప్రస్తుతం వినమ్రంగా కోరుతున్నాం’’ అని తెలిపారు.  రాష్ట్ర భాజపా నాయకులు ఇకనైనా మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి.. రాజకీయాలు పక్కన పెట్టి.. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని హితవు పలికారు.

డిమాండ్లు ఇవీ...
* దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు 1,250 ఎకరాల్లో వరంగల్‌లో ఏర్పాటు చేశాం. అక్కడ ఇప్పటికే రెండు పరిశ్రమలు  ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించాయి.  ఇక్కడి పార్కుకు పీఎం మిత్ర పథకంలో రూ.895.92 కోట్లు మంజూరు చేయండి. ఇప్పటికే అయిదారు లేఖలు రాశాం.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూం టెక్నాలజీ సంస్థ ఉండేది. రాష్ట్ర విభజనతో అది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి వెళ్లింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది చేనేత వస్త్రోత్పత్తిదారులకు శిక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, దుబ్బాక, కమలాపూర్‌, నల్గొండ వంటి ఎన్నో చేనేత సమూహాలున్నాయి. పోచంపల్లి కేంద్రంగా ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తే చేనేత కార్మికులకు ఎంతో మేలు కలుగుతుంది.

* రాష్ట్రంలో మర, చేనేత మగ్గాలను ఆధునికీకరించాల్సి ఉంది. మేం 50 శాతం భరిస్తాం. కేంద్రం 50 శాతం ఇవ్వాలి. రాష్ట్రంలోని 11 బ్లాక్‌లెవల్‌ క్లస్టర్లలో నేషనల్‌ హ్యాండ్లూం డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంని మంజూరు చేయాలి. జాతీయ స్థాయి టెక్స్‌టైల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రాష్ట్రానికి మంజూరు చేయండి. దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న రాష్ట్రంపై వివక్ష చూపించడం సరికాదు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల పక్షాన మా ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం మనసు పెట్టి రాబోయే బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం.

* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇకనైనా రాజకీయాలు, విమర్శలు మాని సిరిసిల్లకు రూ.50 కోట్లతో మెగా పవర్‌లూం క్లస్టర్‌ మంజూరు చేయించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని