దేశ రాజధానిలో నేతాజీ భారీ విగ్రహం

మహోన్నత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాలకు గుర్తుగా దేశరాజధానిలోని ఇండియాగేట్‌ వద్ద ఆయన భవ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 22 Jan 2022 04:42 IST

సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాలకు గుర్తుగా..
ప్రధాని మోదీ ప్రకటన
రేపు హోలోగ్రాం ప్రతిమ ఆవిష్కరణ

ఈనాడు, దిల్లీ: మహోన్నత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాలకు గుర్తుగా దేశరాజధానిలోని ఇండియాగేట్‌ వద్ద ఆయన భవ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్రోద్యమంలో ఆయన పోషించిన పాత్రను ఘనంగా చాటిచెప్పేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. గ్రానైట్‌ రాయితో తయారుచేసే ఈ విగ్రహం పూర్తవ్వడానికి కొంత సమయం పడుతుందని అప్పటివరకు.. ఇండియా గేట్‌ వద్ద బోస్‌ హోలోగ్రామ్‌ (బీమ్‌ లైట్లతో ఏర్పాటు చేసే 3డీ చిత్రం) ప్రతిమను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీన్ని నేతాజీ జయంతి సందర్భంగా ఆదివారం (జనవరి 23) తాను ఆవిష్కరిస్తానని వెల్లడించారు. ఇండియా గేట్‌ వద్ద ఉన్న అమర జవాను జ్యోతిని.. జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలపాలని కేంద్రం నిర్ణయించడం, పశ్చిమ బెంగాల్‌ శకటాన్ని గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించేందుకు నిరాకరించడం.. నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. హోలోగ్రామ్‌ ప్రతిమ ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకు సంబంధించిన సుభాష్‌చంద్రబోస్‌ ఆపద ప్రబంధన్‌ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ప్రకృతివైపరీత్యాల సమయంలో  సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం యేటా ఈ అవార్డులు అందిస్తోంది. ఇందుకు ఎంపికైన సంస్థలకు రూ.51 లక్షల నగదు, ప్రశంసాపత్రం, వ్యక్తులకైతే రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందిస్తారు.


తెలంగాణ శిలతో..

భువనేశ్వేర్‌: ఇండియా గేట్‌ దగ్గర ప్రతిష్ఠించే సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం 25 అడుగులు ఎత్తు ఉంటుందని.. దీన్ని తెలంగాణ నుంచి తెచ్చే గ్రానైట్‌ రాయితో నిర్మిస్తామని శిల్పి అద్వైత గఢ్‌నాయక్‌ తెలిపారు. ఒడిశాకు చెందిన గఢ్‌నాయక్‌.. దిల్లీలో నేషనల్‌ మోడ్రన్‌ ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.  ఇంతటి గొప్ప అవకాశం తనకు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని