ఆహా ఏమి రుచి.. అనండి మైమరచి

తినే తిండి ఏదైనా దాన్ని ఆస్వాదించాలి. తినేటప్పుడు ఆ ఆహార పదార్థాలు ఎంత రుచికరంగా ఉన్నాయో తెలియజెప్పేలా ముఖ కవళికలను ప్రదర్శించాలి. నోట్లో ముద్ద పెట్టుకోగానే.. ‘వావ్‌.. చాలా బాగుంది’ అన్నట్లుగా ముఖంలో భావాన్ని పలికించాలి.

Published : 23 Jan 2022 05:09 IST

అమ్మానాన్నలు అలా తింటే పిల్లలూ అనుసరిస్తారు

ఆస్టన్‌ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి

తినే తిండి ఏదైనా దాన్ని ఆస్వాదించాలి. తినేటప్పుడు ఆ ఆహార పదార్థాలు ఎంత రుచికరంగా ఉన్నాయో తెలియజెప్పేలా ముఖ కవళికలను ప్రదర్శించాలి. నోట్లో ముద్ద పెట్టుకోగానే.. ‘వావ్‌.. చాలా బాగుంది’ అన్నట్లుగా ముఖంలో భావాన్ని పలికించాలి. అప్పుడే పిల్లలూ పెద్దలను అనుసరిస్తారు. ఆరోగ్యకరమైన పదార్థాలను చిన్నారులకు అలవాటు చేయడంలో పెద్దలు ఈ తరహా ధోరణిని అవలంబించాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇటీవల యూకేలోని ఆస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘కాలేజ్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌’ మానసిక వైద్యనిపుణులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. రుచిని ఆస్వాదిస్తూ తింటున్న తల్లిదండ్రులను చూసి అనుసరించడానికి ఎక్కువమంది పిల్లలు మొగ్గుచూపినట్లుగా ఆ పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో చిన్నతనం నుంచి పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారాలను ఎలా అలవాటు చేయాలనే అంశంపై  ప్రత్యేక కథనం.  


అలా తినాలి.. ఆహా అనాలి!

ఈనాడు- హైదరాబాద్‌, అమరావతి

ఉరుకులు పరుగుల జీవితంలో తిండికి కూడా పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేని పరిస్థితులు నెలకొన్నాయి. సంతానం తల్లిదండ్రులతో కలిసి కూర్చుని తినడం చాలా వరకూ తగ్గిపోయింది. ఒకవేళ తింటున్నా టీవీ చూస్తూనో.. మొబైల్‌తోనో గడుపుతున్నారు. ఈ స్థితిలో తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకోవడం అనేది అరుదే. ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడం లేదని వారిని మందలించడం కంటే.. ఆ దిశగా అసలు తాము ఏరకమైన ప్రయత్నాలు చేశామనే కోణంలో పెద్దలు ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనం నుంచి మంచి ఆహారాలను అలవాటు చేస్తే.. అది వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

తొలి ఆర్నెల్లు కీలకం

ఆహారపు అలవాట్లలో పరిణామ క్రమాలుంటాయి. శిశువు పుట్టిన మొదటి ఆర్నెల్లలో తల్లి ఆహారపు అలవాట్లే తొలుత అత్యంత కీలకమవుతాయని నిపుణులు చెబుతున్నారు. బాలింత రుచులు పాల ద్వారా శిశువుకు చేరతాయి. తల్లి ఎన్ని ఎక్కువ రకాల ఆహారాలను తింటే.. శిశువుకు కూడా తల్లి పాల ద్వారా అన్ని రుచులు తెలుస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఘన రూపంలో ఆయా పదార్థాలను ఇచ్చినప్పుడు వ్యతిరేకత లేకుండా వాటి రుచులను ఆస్వాదించడానికి అవకాశాలెక్కువ. ఇది ఒక రకంగా ఆహారపు అలవాట్లలో తొలి పరిణామ క్రమం.

ఆదర్శంగా నిలవాల్సింది పెద్దలే

పెద్దవారు కంచం ముందు కూర్చొని.. కొన్ని ఆహారాలను పక్కనబెట్టేసి.. ‘నాకు నచ్చట్లేదు..నేను తినను’ అని మాట్లాడుతుంటే పిల్లలూ అనుసరిస్తారు. అది తినకూడదేమో.. మంచిది కాదేమో.. బాగుండదేమో అని భావించే అవకాశాలున్నాయి. అందుకే తినేటప్పుడు తల్లిదండ్రులు ఆహారాల గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారనేది చాలా ముఖ్యమైన అంశం. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకూ కుటుంబమంతా కలిసి తినడం మంచి    అలవాటు.

టీవీ లోకంలో పడితే ఎక్కువ తినేసే ప్రమాదం

తింటున్న సమయంలో పిల్లల్ని ఎందుకూ పనికిరావని తిట్టడమూ, వారి చదువు  గురించి మాట్లాడడమూ.. చేయకూడదు. ఒత్తిడి పెంచకూడదు. అలా చేస్తే ఎప్పుడెప్పుడు అక్కణ్నుంచి వెళ్లిపోదామా అనే ధోరణి వారిలో పెరుగుతుంది. అలా కాకుండా వారి అలవాట్లను శ్రద్ధగా పరిశీలించాలి. తద్వారా ఏం తింటున్నారు? ఏమి తినలేకపోతున్నారు? కారణాలేమిటో తెలుస్తుంది. సినిమా, టీవీ చూస్తూ ఆహార పదార్థాలను తినడాన్ని పూర్తిగా మానేయాలి. ఎందుకంటే అలా తింటున్నప్పుడు కడుపు నిండిందా? లేదా? అనేది గమనించకుండా ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉంటుంది. బరువు పెరుగుతారు. ఇవన్నీ పెద్దవారు చేయకుండా ఉంటే.. చిన్నపిల్లలూ పాటిస్తారు.


త్వరగా తినమని ఒత్తిడి చేయొద్దు

ఈ పని చేయకపోతే చాక్‌లెట్‌ కొనివ్వను.. ఈ హోంవర్కు పూర్తి చేస్తే స్వీట్‌ కొనిస్తాలాంటి ధోరణులు సరికాదు. ఆహారమనేది తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించడానికి, ప్రోత్సహించడానికి మధ్య సంబంధంగా ఉండకూడదు. అలా చేస్తే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినేద్దామనే ధోరణి పిల్లల్లో ప్రబలే ప్రమాదం ఉంటుంది. అలాగే నెమ్మదిగా తినడం నేర్పించాలి. బడికి సమయం దాటిపోతోంది. త్వరగా తినమని ఒత్తిడి చేయొద్దు. అలా త్వరత్వరగా తినడం వల్ల పిల్లలకు ఆ ఆహారపు రుచి కూడా తెలియదు. ఆస్వాదించే అవకాశమే ఉండదు. కొసరి కొసరి వడ్డించడమూ సరైన పద్ధతి కాదు. ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాలను అలవాటు చేస్తే.. బయటకు వెళ్లినప్పుడు కూడా అటువంటివే తింటారు.

- డాక్టర్‌ చంద్రశేఖర్‌, ప్రముఖ మానసిక వైద్యనిపుణులు, ఆశా ఆసుపత్రి, హైదరాబాద్‌


13 ఏళ్లలోపు వయసు ఎంతో కీలకం

చిన్న వయసు నుంచే మంచి ఆహార అలవాట్లు నేర్పిస్తే భవిష్యత్తులో పిల్లల్లో అనారోగ్య సమస్యలు తగ్గించేందుకు వీలుంటుంది. ముఖ్యంగా 13 ఏళ్లలోపు చిన్నారుల్లో మంచి ఆహార అవాట్లు తీసుకురాగలిగితే...భవిష్యత్తులో వారికి అనారోగ్య సమస్యలు చాలా వరకూ దూరంగా ఉంటాయి. మంచి పదార్థాలను తీసుకోవడానికి పిల్లలు ఇష్టపడకపోతే తల్లిదండ్రులు వారి మనసు మార్చే ప్రయత్నాలు తొలి నుంచే చేయాలి. ఏది తింటే మంచి.. ఏది చెడు.. అనే అంశాలను సోదాహరణంగా వివరించాలి. జంక్‌ ఫుడ్‌ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. పోషకాహారం వల్ల కలిగే లాభాలను చెప్పాలి. ఊబకాయం బారినపడకుండా ముందు నుంచే జాగ్రత్తపడాలి. బరువు ఎక్కువగా పెరిగితే అమ్మాయిల్లో హార్మోన్ల సమస్యలు కూడా వస్తాయి.

- డాక్టర్‌ ఎన్‌.ప్రసన్నకుమార్‌, సహ ఆచార్యులు, పిల్లల మానసిక వైద్య నిపుణులు, ఆంధ్రా వైద్య కళాశాల, వైజాగ్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు