వైరస్‌ కొత్త రకాలపై ముందుగానే అంచనా

కొత్తరకం వైరస్‌ ఒమిక్రాన్‌ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. అంతకుముందు డెల్టా రకం ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త రకాలను ముందుగానే గుర్తిస్తే కట్టడికి మరింత సమర్థ చర్యలు

Published : 23 Jan 2022 04:53 IST

  ఐఎస్‌ఎన్‌వీ ట్రాకింగ్‌తో సాధ్యమే అంటున్న సీసీఎంబీ పరిశోధకులు

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తరకం వైరస్‌ ఒమిక్రాన్‌ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. అంతకుముందు డెల్టా రకం ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త రకాలను ముందుగానే గుర్తిస్తే కట్టడికి మరింత సమర్థ చర్యలు తీసుకునేందుకు.. వ్యాప్తిని ఆదిలోనే అడ్డుకునేందుకు వీలవుతుంది. మరి వైరస్‌లోని కొత్త రకాలను ముందుగానే గుర్తించవచ్చా? అంటే అవుననే అంటున్నారు సీసీఎంబీ పరిశోధకులు. కొవిడ్‌ మొదటి, రెండో వేవ్‌ సమయంలో రోగుల నమూనాలపై వీరు నిర్వహించిన జన్యుక్రమ విశ్లేషణ ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. ఇందులో వైరల్‌ జినోమ్‌లో విస్తరించిన సింగిల్‌ న్యూక్లియోటైడ్‌ వేరియేషన్స్‌ (ఎస్‌ఎన్‌వీ) ఆధారంగా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినప్పుడు మార్పులకు దారి తీస్తున్నట్లు గుర్తించారు. ఏ మేరకు ఉత్పరివర్తనాలు ఉన్నాయనేది హోస్ట్‌ సింగిల్‌ న్యూక్లియోటైడ్‌ వేరియేషన్స్‌ (ఐఎస్‌ఎన్‌వీ) విశ్లేషణ ద్వారా తెలుసుకున్నారు. కొత్తగా కనిపించిన ఉత్పరివర్తనాల ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ఎక్కువ వ్యాప్తికి కారణమయ్యే రకంగా మారే అవకాశాలున్నట్లు అంచనాకు వచ్చారు. రోగి శరీరంలో ఉన్నప్పుడే కొత్త ఉత్పరివర్తనాలతో వైరస్‌ ఎలా పరిణామం చెందుతుంది? కొత్త రకాలకు ఎలా దారి తీస్తుందనేది కనుగొన్నారు.
* జూన్‌ 2020కి ముందు మొదటి వేవ్‌ సమయంలో చైనా, జర్మనీ, మలేసియా, యూకె, యూఎస్‌, భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 1,347 నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. అప్పట్లో బాగా వ్యాప్తిలో ఉన్న బి.1, బి.6 రకాలకు చెందిన నమూనాల్లోని వైరస్‌ జీనోమ్‌లో 16,410 ఐఎస్‌ఎన్‌వీ విస్తరించి ఉన్నట్లు గమనించారు.

* రెండో దశలో నవంబరు 2020 నుంచి మే 2021 మధ్యలో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సేకరించిన 1,774 నమూనాల జన్యుక్రమ విశ్లేషణలో డెల్టా, కప్పా రకాలు వ్యాప్తిలో ఉన్నట్లు ఐఎస్‌ఎన్‌వీ ద్వారా గుర్తించారు. జన్యు నిఘాలో భాగంగా ఐఎస్‌ఎన్‌వీలను ట్రాక్‌ చేయడం ద్వారా ఆందోళన స్థాయికి చేరే వైరస్‌ రకాలను ముందుగానే అంచనా వేయవచ్చని పరిశోధనలో పాలుపంచుకున్న సీసీఎంబీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. దిల్లీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ(ఐజీఐబీ), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ), జోధ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) పరిశోధనలో భాగస్వాములయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని