కొత్త విలువలు ఖరారు

రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల కొత్త మార్కెట్‌ విలువల నిర్ధారణ ప్రక్రియను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తి చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త మార్కెట్‌ విలువలను అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికి

Published : 24 Jan 2022 05:03 IST

హైదరాబాద్‌ పరిధిలో స్థిరాస్తులకు 40-50 శాతం పెంపు?
రిజిస్ట్రేషన్‌ శాఖ కసరత్తు పూర్తి
ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల కొత్త మార్కెట్‌ విలువల నిర్ధారణ ప్రక్రియను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తి చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త మార్కెట్‌ విలువలను అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి నేతృత్వంలో ఆ శాఖ సీనియర్‌ అధికారులు, జిల్లా రిజిస్ట్రార్ల్లు నాలుగు రోజులు సుదీర్ఘ కసరత్తు చేసి ఆదివారం కొత్త మార్కెట్‌ విలువల నిర్ధారణ ప్రక్రియను పూర్తిచేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో అమలు చేయనున్న వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల కొత్త మార్కెట్‌ విలువలను ఖరారు చేశారు. వీటిని ముఖ్యమంత్రి, కీలక మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించనున్నారు. సోమవారం ఈ ప్రక్రియ పూర్తిచేసి జిల్లా కమిటీలకు ప్రతిపాదనలు పంపనున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ కమిటీలు కొత్త మార్కెట్‌ విలువలకు ఆమోద ముద్ర వేయనున్నాయి. కొత్త మార్కెట్‌ విలువల నిర్ణయం ప్రధాన కార్యాలయంలోనే పూర్తికావడంతో కమిటీల ప్రక్రియ నామమాత్రం కానుంది. చట్టబద్ధత కోసమే కమిటీల ఆమోదం జరగనుంది.

31న రిజిస్ట్రేషన్లకు విరామం!

కొత్త మార్కెట్‌ విలువలకు అనుగుణంగా కార్డ్‌సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లపై కూడా రిజిస్ట్రేషన్‌ శాఖ దృష్టి సారించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త మార్కెట్‌ విలువలను అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌లో మార్పుల కోసం ఒకటి రెండు రోజులు రిజిస్ట్రేషన్లకు విరామం ప్రకటించనున్నారని తెలిసింది. ఈ నెల 31వ తేదీ సోమవారం రిజిస్ట్రేషన్లకు విరామం ప్రకటించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.మరోవైపు త్వరలో కొత్త రేట్లు అమలు కానుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు భారీగా పెరుగుతాయని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలు సహా తాకిడి ఎక్కువగా ఉండే చోట్ల అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులు సబ్‌ రిజిస్ట్రార్లకు సూచించారు.

ఎక్కడ ఎలా పెరిగిందంటే?

వ్యవసాయ భూముల విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35-40 శాతం, అపార్ట్‌మెంట్ల ఫ్లాట్లవి 25-40 శాతం పెరిగినట్లు తెలిసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల ధరలు ఇప్పుడున్న మార్కెట్‌ విలువ కంటే 40-50 శాతం దాకా పెరిగినట్లు తెలిసింది. సంగారెడ్డి, భువనగిరి, షాద్‌నగర్‌ సహా హైదరాబాద్‌కు చేరువగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోనూ ఇదే విధంగా మదింపు చేశారు. కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ నగరపాలక సంస్థలతో పాటు రియల్‌ ఎస్టేట్‌ జోరు కొనసాగుతున్న కొత్త ప్రాంతాలు మంచిర్యాల, నల్గొండ, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట వంటి జిల్లా కేంద్రాల్లో పెంపును ప్రత్యేక అంశంగా పరిగణించారు. బహిరంగ మార్కెట్‌లో విలువ బాగా ఉండి తక్కువకు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్న వాటిని పరిగణనలోకి తీసుకుని కొత్త రేట్లను నిర్ణయించారు. రియల్‌ఎస్టేట్‌ వెంచర్లుగా మారుతున్న వ్యవసాయ భూములున్న ప్రాంతాలకు కొత్త రేట్లను లెక్క కట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని