జీవో 317లోని లోపాలతో శాశ్వతంగా అన్యాయం

రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ఆధారంగా స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపునకు జారీ చేసిన జీవో 317లో అనేక లోపాలు ఉన్నాయని 17 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన పోరాట కమిటీ (యూఎస్పీసీ) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు

Published : 24 Jan 2022 05:02 IST

సీఎంకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ లేఖ
ఒక్కసారి తమతో చర్చించాలంటూ విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ఆధారంగా స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపునకు జారీ చేసిన జీవో 317లో అనేక లోపాలు ఉన్నాయని 17 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన పోరాట కమిటీ (యూఎస్పీసీ) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆదివారం లేఖ రాసింది. లోపాలను సవరించకపోతే కొందరికి శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని పేర్కొంది. సంఘాలతో ఒక్కసారి చర్చించేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని అభ్యర్థించింది. లేఖలో పేర్కొన్నఅంశాలు... ‘‘రాష్ట్రంలో 33 జిల్లాలను ఏడు జోన్లు, రెండు బహుళ జోన్లుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను శాఖల వారీగా జిల్లా, జోనల్‌, బహుళజోనల్‌ పోస్టులుగా (లోకల్‌ కేడర్‌) వర్గీకరించారు. నూతన లోకల్‌ కేడర్లలో సర్దుబాటు చేయడానికి 06.12.2021న జారీ చేసిన జీవో 317లో పేర్కొన్న మార్గదర్శకాలు వివాదాస్పదంగా మారాయి. ఉద్యోగుల అభ్యంతరాలు, అభ్యర్థనలను పట్టించుకోకుండా కేటాయింపులు చేయడంతో పలువురు శాశ్వతంగా స్థానికతను కోల్పోయారు. సీనియారిటీ జాబితాలు, స్పెషల్‌ కేటగిరి అభ్యర్థనలను సక్రమంగా పరిశీలించలేదు. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. జిల్లాల కేటాయింపులోనూ కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయి. భార్యాభర్తలను ఒకే లోకల్‌ కేడర్‌కు బదిలీ చేయాల్సి ఉండగా కొందరికి మాత్రమే అవకాశం ఇచ్చారు. నష్టపోయిన అభ్యర్థులు న్యాయం చేయాలంటూ అప్పీల్‌ చేసుకుని నెల రోజులు గడుస్తున్నా పరిష్కారం కాలేదు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదనతో ప్రభుత్వానికి సమస్యను తెలిపేందుకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ ఈ సమస్యను మీ దృష్టికి తీసుకురావడంలో ఉన్నతాధికారులు, కొన్ని సంఘాల నాయకులు విఫలమయ్యారని భావిస్తున్నాం. ఇప్పటికైనా పోరాట కమిటీకి (స్టీరింగ్‌ కమిటీకి) అపాయింట్‌మెంట్‌ ఇస్తే కీలక సమస్యలను మీ దృష్టికి తీసుకురాగలం. తగిన పరిష్కారం లభిస్తుందని మేం ఆశిస్తున్నాం’’ అంటూ సంఘాలు లేఖలో విజ్ఞప్తి చేశాయి.


ఉద్యోగులు వారం రోజుల్లో విధుల్లో చేరాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం కింద జరిపిన కేటాయింపుల మేరకు బదిలీ అయిన ఉద్యోగులు విధుల్లో చేరకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ ముందుగా వారికి సంజాయిషీ నోటీసు ఇచ్చి ఆ తర్వాత చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలిసింది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అంతర్గత ఉత్తర్వులు జారీ చేయనుంది. బదలాయింపుల అనంతరం దాదాపు రెండు వందల మంది వరకు ఉద్యోగులు విధుల్లో చేరలేదు. కొత్త స్థానాలపై సంబంధిత ఉన్నతాధికారులకు రిపోర్ట్‌ చేయకుండా... ఇళ్ల వద్దే ఉంటున్నారు. మరికొంత మంది కార్యాలయాలకు రావడం లేదు. ఉద్యోగులు విధుల్లో చేరకపోవడంతో వారికి నిర్దేశించిన స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత ఉద్యోగులకు విధుల్లో చేరేందుకు మరో వారం రోజుల గడువు ఇచ్చి, ఆ తర్వాత వాటిని ఖాళీలుగా చూపి, ఉద్యోగాల భర్తీకి పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని