బండిబాబులూ.. బహుపరాక్‌!

మోటారు వాహనాల చట్టం(ఎంవీ యాక్టు) నిబంధనల్ని అతిక్రమించి ట్రాఫిక్‌ పోలీసు చేతిలోని కెమెరాకు చిక్కకుంటే చాలు జరిమానా తప్పించుకున్నట్లే అని వాహనదారులు/బండిబాబులు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే

Published : 24 Jan 2022 04:11 IST

ఉల్లంఘనులపై సీసీ కెమెరాలతో పెరిగిన జరిమానాలు
ఎంవీ చట్టం కేసుల్లో 85శాతం ఇవే
గతేడాది గణాంకాల ద్వారా వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌ : మోటారు వాహనాల చట్టం(ఎంవీ యాక్టు) నిబంధనల్ని అతిక్రమించి ట్రాఫిక్‌ పోలీసు చేతిలోని కెమెరాకు చిక్కకుంటే చాలు జరిమానా తప్పించుకున్నట్లే అని వాహనదారులు/బండిబాబులు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే కూడళ్లతోపాటు ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన వేలాది సీసీ కెమెరాల ద్వారాను ఉల్లంఘనులను గుర్తించి చలానాలు విధిస్తున్నారు. కంట్రోల్‌రూంల్లో కూర్చుని నిత్యం కెమెరాల ఫీడ్‌ను పరిశీలిస్తున్న సిబ్బందే వీటిని నమోదు చేస్తున్నారు. నిజానికి ట్రాఫిక్‌ సిబ్బంది చేతిలోని కెమెరాలతో విధిస్తున్న చలానాలు కేవలం 15శాతంలోపే. మిగిలిన దాదాపు 85శాతం నాన్‌కాంటాక్టు చలానాలే కావడం గమనార్హం. గతేడాది నమోదు చేసిన కేసుల గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. అలా ఏదైనా వాహనంపై ఉల్లంఘన నమోదు చేసిన అనంతరం ఆర్టీఏ డేటాబేస్‌లోని వివరాల ఆధారంగా చలానా జారీ చేసేస్తున్నారు. డేటాబేస్‌లోని ఫోన్‌నంబరుకు వెంటనే సంక్షిప్త సందేశం పంపించడమే కాకుండా అందులోని చిరునామాకు చలానాను పోస్టులో చేరవేస్తున్నారు.

నాలుగేళ్లలో రెట్టింపు కంటే అధికం

గ్రేటర్‌లోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాల సంఖ్య పెరగడంతో నాన్‌కాంటాక్టు చలానాల జారీ రోజురోజుకీ పెరుగుతోంది. 2018తో పోల్చితే 2021లో కేసుల సంఖ్య రెట్టింపు కంటే అధికం కాగా.. విధిస్తున్న జరిమానాల సొమ్ము మూడు రెట్లను దాటిపోవడమే ఇందుకు నిదర్శనం. మోటారు వాహనాల చట్టం కింద గతేడాది ఏకంగా దాదాపు 2.22కోట్ల కేసులు నమోదు కాగా.. సుమారు 1.85కోట్ల కేసులు నాన్‌కాంటాక్ట్‌ జాబితాలోనే నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని