చారిత్రక తప్పులను సరిదిద్దుతున్నాం

స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది చేసిన త్యాగాలను తుడిచేసే ప్రయత్నం గతంలో జరిగిందని, ఇప్పుడు తాము ఆ తప్పులను సరిదిద్దుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ దళపతి సుభాష్‌ చంద్రబోస్‌

Published : 24 Jan 2022 04:20 IST

ఎంతో మంది త్యాగాలను గత ప్రభుత్వాలు విస్మరించాయి
నేతాజీ నివాస సందర్శన అనుభూతిని మాటల్లో చెప్పలేను
సుభాష్‌ చంద్రబోస్‌ హాలోగ్రామ్‌ విగ్రహావిష్కరణలో మోదీ  

ఈనాడు, దిల్లీ: స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది చేసిన త్యాగాలను తుడిచేసే ప్రయత్నం గతంలో జరిగిందని, ఇప్పుడు తాము ఆ తప్పులను సరిదిద్దుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ దళపతి సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకొని ఇండియాగేట్‌ వద్ద 28 అడుగుల ఎత్తైన గ్రానైట్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం దాని హాలోగ్రామ్‌ విగ్రహాన్ని డిజిటల్‌ రూపంలో ఆవిష్కరించి, ప్రసంగించారు.

విజయాలే మన సంకల్ప శక్తికి సాక్ష్యాలు

‘‘2047కి ముందే సరికొత్త భారత దేశాన్ని నిర్మించుకోవాలన్న లక్ష్యం మన ముందిప్పుడు ఉంది. ఈ లక్ష్యాన్ని చేరకుండా ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. మన విజయాలే మన సంకల్ప శక్తికి సాక్ష్యాలు. మన యాత్ర సుదీర్ఘమైంది. ఎన్నో శిఖరాలు అధిరోహించాల్సి  ఉంది. భారత్‌కున్న గుర్తింపును, ప్రేరణలను పునరుజ్జీవింపజేయాలి. స్వాతంత్య్రం తర్వాత దేశ సంస్కృతితోపాటు, ఎంతోమంది మహానుభావులు చేసిన యోగదానాలను తుడిచేసే పని జరిగింది. దశాబ్దాల తర్వాత దేశం ఆ తప్పులను సరిదిద్దుతోంది. అంబేడ్కర్‌తో ముడిపడిన పంచతీర్థ్‌కున్న ప్రాధాన్యం ఆధారంగా ఈ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐక్యతా విగ్రహ రూపంలో ప్రపంచం మొత్తం సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ కీర్తిని చూస్తోంది.

ఆయన ప్రతి అంకాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది

సుభాష్‌ చంద్రబోస్‌తో ముడిపడిన ప్రతి అంకాన్ని దేశం పూర్తి గౌరవంతో గుర్తు చేసుకుంటోంది. నేతాజీ ద్వారా అండమాన్‌లో త్రివర్ణ పతాకం ఎగిరిన 75వ సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి ఒక ద్వీపానికి ఆయన పేరు పెట్టాం. కోల్‌కతాలో నేతాజీ పుట్టిన ఇంటికి వెళ్లే భాగ్యం గత ఏడాది నాకు దక్కింది. ఆయన చదువుకున్న గది, ఆ ఇంటి గోడలు, మెట్లను దర్శించుకున్న అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. ఎర్రకోటలోనూ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు సంబంధించిన స్మారకం ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేతాజీ జీవితంతో ముడిపడిన దస్త్రాలను బహిర్గతం చేసే అవకాశం మా ప్రభుత్వానికి లభించింది. బోస్‌ ఏదైనా సంకల్పిస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేకపోయేవారు. అందుకే మనం నేతాజీ నుంచి కెన్‌ డు, విల్‌ డూ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలి. నేతాజీ కలలుగన్న భారత్‌ను తీర్చిదిద్దడంలో మనం సఫలమవుతామన్న నమ్మకం నాకుంది’’ అని మోదీ పేర్కొన్నారు. సందర్శకుల కోసం  ఇండియాగేట్‌ వద్ద డిజిటల్‌ తెర ఏర్పాటు చేశారు. డిజిటల్‌ దీపాల వెలుగులో రాత్రిళ్లు మాత్రమే దీనిపై విగ్రహం కనిపిస్తుంది. దీని ఎత్తు 28 అడుగులు. వెడల్పు ఆరు అడుగులు.


రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి నివాళి

నేతాజీ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ ‘పరాక్రమ్‌ దివస్‌’ శుభాకాంక్షలు తెలిపారు. నేతాజీ ఆదర్శాలు, త్యాగాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతాయని కోవింద్‌ చెప్పారు. బోస్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఫొటోను మోదీ ట్విటర్‌లో పంచుకున్నారు. ఆయనకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్‌ చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులోని నేతాజీ చిత్రపటానికి ప్రధాని పుష్పాంజలి ఘటించారు. ప్రతి భారతీయుడి హృదయంలో స్వరాజ్య ఉద్యమంపై సరికొత్త ఉత్సాహాన్ని నింపిన మహోన్నత జాతీయవాది సుభాష్‌ చంద్రబోస్‌ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. స్వరాజ్య సంగ్రామంలో ఉన్నత పాత్రను పోషించిన వారికి దేశం రుణపడి ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని