ఈసారైనా విత్తన రాయితీ ఇస్తారా?

వచ్చే వానాకాలంలో మినుము, పెసర, కంది తదితర పప్పుధాన్యాల పంటలు సాగు పెంచాలని.. వరి తగ్గించాలని వ్యవసాయశాఖ యోచిస్తున్న నేపథ్యంలో రైతులు విత్తన రాయితీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిని 2020

Published : 24 Jan 2022 04:26 IST

వానాకాలం సీజన్‌కు రూ.240 కోట్లు అవసరం
వ్యవసాయ శాఖ ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే వానాకాలంలో మినుము, పెసర, కంది తదితర పప్పుధాన్యాల పంటలు సాగు పెంచాలని.. వరి తగ్గించాలని వ్యవసాయశాఖ యోచిస్తున్న నేపథ్యంలో రైతులు విత్తన రాయితీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిని 2020 వానాకాలం నుంచి ఈ శాఖ నిలిపివేసింది. పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సంకరజాతి విత్తనాలు కొనాలంటే ప్రైవేటు కంపెనీలు ధరలు పెంచేశాయని, సబ్సిడీపై ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కానీ గత 4 పంట సీజన్లలో పప్పుధాన్యాలు, ఆహార పంటలకు ఏమీ ఇవ్వలేదు. ఈ సారన్నా రాయితీపై విత్తనాలు ఇచ్చి ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు. ఇందుకోసం అన్ని రకాల విత్తనాలకూ కలిపి రూ.240 కోట్లు ఇవ్వాలని వ్యవసాయశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గతేడాది బడ్జెట్‌లో రూ.74 కోట్లు మాత్రమే ఇవ్వడంతో జనుము, పిల్లిపెసర, జీలుగ విత్తనాలకే ఇచ్చారు. 2019 వరకూ వివిధ విత్తనాల కొనుగోలుపై ఇచ్చిన రాయితీని తిరిగి 2022 వానాకాలం సీజన్‌ నుంచి పొడిగించాలని వ్యవసాయశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బడ్జెట్‌లో ఇందుకు నిధులు కేటాయిస్తేనే మే నెల నుంచి రైతులకు తక్కువ ధరకు విత్తనాలు విక్రయించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.

పప్పు ధాన్యాల సాగు పెంచాలని కేంద్రం సూచన

వచ్చే వానాకాలంలో జూన్‌ నుంచి కొత్త పంటల సాగులో పప్పుధాన్యాలను పెద్దయెత్తున సాగుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కంది, మినుము, పెసర పంటలను 30 లక్షల ఎకరాల్లో సాగుచేయించాలన్నది కొత్త లక్ష్యం. గత వానాకాలంలో ఈ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 11.32 లక్షల ఎకరాలకు గాను 9.05 లక్షల ఎకరాల్లోనే రైతులు వేశారు. వాటిని గణనీయంగా పెంచాలని కేంద్రం రాష్ట్ర వ్యవసాయశాఖకు సూచించింది. ఏడాది పొడవునా డిమాండు ఉండే ఈ పంటలను సాగుచేస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుందని కేంద్రం తెలిపింది.

కొందామన్నా దొరకలేదు...

పప్పుధాన్యాలను మద్దతు ధరకు కొనాలని కేంద్రం రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(మార్క్‌ఫెడ్‌)కు గత వానాకాలంలో సూచించింది. కానీ అధిక వర్షాలకు పంటలు దెబ్బతినడం వల్ల మినుములు, పెసలు ఒక్క గింజను కూడా కొనలేకపోయినట్లు మార్క్‌ఫెడ్‌ కేంద్రానికి తెలిపింది. ఇక గత అక్టోబరు నుంచి మొదలైన ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌లో మినుము పంట సాగు పెంచాలని మార్కెట్‌లో మద్దతు ధరకన్నా ఎక్కువున్నా కొని ఇవ్వాలని కేంద్రం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయినా పప్పుధాన్యాల పంటల సాగు పెద్దగా పెరగలేదు. ఈ సీజన్‌లో పెసర సాధారణ సాగు విస్తీర్ణం 21,488 ఎకరాలు కాగా ఇప్పటికి కేవలం 13,196 ఎకరాల్లోనే రైతులు వేశారని వ్యవసాయశాఖ తాజాగా కేంద్రానికి తెలిపింది. మినుము 24 వేల ఎకరాలకు గాను 66,118 ఎకరాల్లో వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని