15 ఆసుపత్రులకు రూ.10.84 కోట్లు

రాష్ట్రంలో తొలి దశలో 12 జిల్లాల్లోని 15 దవాఖానాలను ఆధునికీకరించనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకోసం రూ.10.84 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

Published : 25 Jan 2022 04:31 IST

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలి దశలో 12 జిల్లాల్లోని 15 దవాఖానాలను ఆధునికీకరించనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకోసం రూ.10.84 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, జ్వర సర్వే, టీకాల పంపిణీ తదితర అంశాలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకరరెడ్డి, వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి, నిమ్స్‌ సంచాలకులు మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. తొలిదశలో నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నిజామాబాద్‌, హైదరాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌, యాదాద్రి భువనగిరి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల పరిధిలోని 4 జిల్లా, 8 ప్రాంతీయ, 3 సామాజిక ఆసుపత్రుల్లో ఆధునికీకరణ పనులు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 20 రక్త నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.12 లక్షల చొప్పున ఖర్చుతో 12 జిల్లాల పరిధిలోని ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 57 బ్లడ్‌ బ్యాంకులు, 51 నిల్వ కేంద్రాలు ఉన్నాయని మంత్రి వివరించారు. జ్వర సర్వే విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


గ్రాంట్లు, బకాయిల నిధులు.. రూ. 30,715 కోట్లు విడుదల చేయండి

కేంద్రానికి హరీశ్‌రావు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలతో పాటు, స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, నీతిఆయోగ్‌ సిఫారసుల మేరకు తెలంగాణ రాష్ట్రానికి  రూ.30,751 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ అంశాలపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖల వివరాలనూ ప్రస్తావించారు. తాజా లేఖలో పేర్కొన్న అంశాలివీ..

* రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధుల్లో రూ.900 కోట్లు తెలంగాణకు ఇంకా విడుదల కావాల్సి ఉంది. వీటిని ఇవ్వడంతో పాటు.. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి మరో అయిదేళ్లు ఈ పథకాన్ని పొడిగించాలి.
* నీతిఆయోగ్‌ సూచించిన మేరకు రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ.24,205 కోట్లు విడుదల చేయాలి.
* 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.817.61 కోట్లను పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయాలి. ఆ సిఫారసులను తిరస్కరించడం సరికాదు.  
* 2019-20 నుంచి తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.  
* కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో భాగంగా.. 2014-15లో తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. వీటిని ఇంకా ఇవ్వలేదు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లు సర్దుబాటు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు