మహమ్మారి ముగుస్తోందని భావించొద్దు

కరోనా మహమ్మారి ముగింపు దశకు వచ్చిందని భావించడం చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హెచ్చరించింది.

Published : 25 Jan 2022 05:39 IST

మరిన్ని వేరియంట్లు పుట్టుకురావొచ్చు

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

జెనీవా: కరోనా మహమ్మారి ముగింపు దశకు వచ్చిందని భావించడం చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హెచ్చరించింది. మహమ్మారి తీవ్రదశ ఈ ఏడాది చివరివరకూ కొనసాగవచ్చని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌-జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి మనముందు కొన్ని సవాళ్లున్నాయి. యాంటీ-బయోటిక్స్‌ చికిత్సల సామర్థ్యం తగ్గుతుండటం, వాతావరణ మార్పుల కారణంగా ప్రజల ఆరోగ్యానికి ముప్పు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. కరోనా విషయంలో ఒమిక్రానే చివరి వేరియంట్‌ అని, దీంతో మహమ్మారి అంతమవుతుందని భావించడం చాలా ప్రమాదకరం. ప్రతి దేశంలోనూ కొవిడ్‌ ముప్పు తీవ్రంగా ఉన్న వర్గాలకు ప్రాధాన్యమిస్తూ, ఈ ఏడాది జూన్‌-జులై నాటికి 70% మంది ప్రజలకు వ్యాక్సిన్‌ అందించాలి. పరీక్షల సంఖ్యను పెంచాలి. కొత్త వేరియంట్లను సత్వరం గుర్తించి, నియంత్రించాలి. ఇవన్నీ చేయగలిగితే... డిసెంబరు నాటికి మహమ్మారి తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. భవిష్యత్తులోనూ కరోనాతో జీవించక తప్పదు. కొవిడ్‌ అన్నది నివారించదగ్గ వ్యాధి. చికిత్సలతోనూ దీన్ని సమర్థంగా ఎదుర్కోగలం. అలాంటి వ్యాధి కారణంగా వారానికి 50 వేలమంది చనిపోతూ ఉండటాన్ని ఏమాత్రం అంగీకరించలేం. కలిసికట్టుగా కృషిచేస్తే దీన్ని అడ్డుకోవడం సుసాధ్యమవుతుంది. మున్ముందు తలెత్తే మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా.. శ్వాసకోశ వ్యాధుల నియంత్రణ వ్యవస్థలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండాలి’’ అని టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు.

కొత్తగా 3 లక్షల కేసులు

దిల్లీ, ఇండోర్‌: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా విజృంభిస్తోంది. కొత్తగా 3,06,064 మంది వైరస్‌ బారినపడగా, అనారోగ్యం తీవ్రమవడంతో మరో 439 మంది బాధితులు మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 3,95,43,328కి, మరణాలు 4,89,848కి పెరిగాయి. ప్రస్తుతం 22,49,335 మంది ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం వెల్లడించింది.

హడలెత్తిస్తున్న సబ్‌ వేరియంట్లు!

కేసులు పెరుగుతున్న క్రమంలోనే ఒమిక్రాన్‌ సబ్‌-వేరియంట్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ శ్రేణికి చెందిన బీఏ1, బీఏ2 వైరస్‌ల కారణంగా బ్రిటన్‌లో పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బీఏ2 స్టెయ్రిన్‌లో 53 సీక్వెన్స్‌లు ఉన్నాయని, ఇది శరవేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్‌ హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. సబ్‌-వేరియంట్ల కారణంగా గుజరాత్‌లో 24 గంటల వ్యవధిలోనే 41 కేసులు వెలుగుచూశాయి! మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ జనవరి 6 నుంచి ఇప్పటివరకూ మొత్తం 21 మందికి ‘బీఏ2’ వేరియంట్‌ సోకినట్టు స్థానిక ప్రయోగశాల ‘మాలిక్యులర్‌ వైరాలజీ డయాగ్నోస్టిక్‌ అండ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌’ వెల్లడించింది. బాధితుల్లోని ఓ చిన్నారి సహా నలుగురు వయోజనుల్లో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ రేటు 15-40% ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు, ప్రికాషన్‌ డోసు తీసుకున్నవారికి కూడా సబ్‌-వేరియంట్లు సోకినట్టు అధికారులు తెలిపారు.


ఫిబ్రవరి 15 నాటికి కేసులు తగ్గుముఖం

దిల్లీ: దేశంలో కొవిడ్‌ మూడోదశ కొనసాగుతోంది. కొద్ది రోజుల నుంచి రోజువారీ కేసులు మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. కిందటి రోజుతో పోల్చితే సోమవారం నమోదైన కేసుల్లో తగ్గుదల కనిపించింది. దిల్లీ, ముంబయి సహా పలు మెట్రో నగరాల్లోనూ, పలు రాష్ట్రాల్లోనూ వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని