ఏకపక్షంగా అప్పగింత నోట్‌ ఎలా రూపొందిస్తారు

గోదావరి నదిపై ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌసు కాంపోనెంట్లను గోదావరి బోర్డుకు అప్పగించాలన్న ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Published : 25 Jan 2022 04:31 IST

మేడిగడ్డ.. ఇతర కాంపోనెంట్లు బోర్డుకు ఇవ్వాల్సిన అవసరం లేదు

గోదావరి ఉప సంఘ సమావేశంలో తెలంగాణ అసంతృప్తి

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరి నదిపై ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌసు కాంపోనెంట్లను గోదావరి బోర్డుకు అప్పగించాలన్న ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. సోమవారం గోదావరి బోర్డు ఉప సంఘం వర్చువల్‌గా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో సమావేశాన్ని నిర్వహించింది. బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండ్యా, సభ్యుడు కుటియాల్‌ సమావేశాన్ని నిర్వహించగా తెలంగాణ తరఫున శ్రీధర్‌రావు దేశ్‌పాండే, అంతరాష్ట్ర జల విభాగం ఈఈ సుబ్రహ్మణ్య ప్రసాద్‌, ఏపీ నుంచి గోదావరి డెల్టా సిస్టం సీఈ పుల్లారావు, ఏపీ జెన్కో సీఈలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి మేడిగడ్డ, కన్నెపల్లి పంపుహౌస్‌, ఏపీ నుంచి వెంకటనగరం పంపింగ్‌ స్కీంలను బోర్డు పరిధిలోకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేసిన అప్పగింత నోట్‌ను (హ్యాండింగ్‌ ఓవర్‌ నోట్స్‌) సమావేశంలో చర్చకు పెట్టారు.

అభ్యంతరం తెలిపిన తెలంగాణ

కాంపొనెంట్ల అప్పగింతపై జరిగిన చర్చ సందర్భంగా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. 11.10.2021న నిర్వహించిన గోదావరి బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన ఖమ్మం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టును జీఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రం అంగీకరించి సమాచారాన్ని బోర్డుకు అందజేసింది. ఇతర ప్రాజెక్టుల కాంపొనెంట్లను బోర్డు పరిధిలోకి తీసుకువచ్చే అవసరం ప్రస్తుతం లేదని చెప్పింది. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్‌-2లో పేర్కొన్న అయిదు ప్రాజెక్టులను తొలగించాలని, మరికొన్నింటి కాంపొనెంట్లను షెడ్యూల్‌-2 నుంచి షెడ్యూల్‌-3లోకి మార్చాలని విజ్ఞప్తి చేస్తూ గతంలో గోదావరి బోర్డు, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖలకు లేఖలు రాసినా ఇంత వరకు స్పందన లేదని, ఈ స్థితిలో బోర్డు పరిధిలోకి కాంపొనెంట్లను తీసుకొచ్చే అంశాన్ని ప్రస్తుతం పరిశీలించాల్సిన అవసరంలేదని సూచించింది. గోదావరి బోర్డు అనుమతి లేకుండానే జీఆర్‌ఎంబీ సెక్రటేరియట్‌ సభ్యులు ఏక పక్షంగా గోదావరి ప్రాజెక్టులను సందర్శించి అప్పగింత నోట్‌ (హ్యాండింగ్‌ ఓవర్‌ నోట్‌) తయారు చేయడం పట్ల తెలంగాణ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత సమావేశంలో నోట్‌పై చర్చించలేమంది. గత కమిటీ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను అసంపూర్ణంగా రికార్డు చేశారని, ప్రస్తుత సమావేశం మినిట్స్‌లో తమ అభిప్రాయాలను సంపూర్ణంగా రికార్డు చేయాలని సభ్యులు కోరారు.

ఎక్కడికైనా తరలించుకునే అధికారం

అనంతరం ఏపీలోని వెంకటనగరం పంపింగ్‌ హౌస్‌పై జరిగిన చర్చలో ఏపీ సభ్యులు మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన అన్ని కాంపొనెంట్లను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కోరారు. దీనిపై తెలంగాణ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని, అవి తెలంగాణ ఆయకట్టుకు మాత్రమే నీటిని సరఫరా చేస్తాయని తెలిపారు. గోదావరి అవార్డు క్లాజ్‌-4 ప్రకారం రాష్ట్రాలకు గోదావరిలో తమ వాటా నీళ్లను ఎక్కడికైనా తరలించుకునే అధికారం ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రాజెక్టులు కాని వాటిని బోర్డు పరిధిలోకి తీసుకోవాలన్న ఏపీ వాదన సమంజసం కాదని తెలంగాణ తరఫున పాల్గొన్న సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని