రాష్ట్రంలో 33,673 క్రియాశీల కేసులు

రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమేణా పెరిగిపోతోంది. కేవలం 3 వారాల వ్యవధిలోనే దాదాపు 100 రెట్ల వరకూ క్రియాశీల కేసులు పెరగడం గమనార్హం. ఈ నెల 1న 317 క్రియాశీల కేసులుండగా..

Published : 25 Jan 2022 04:54 IST

3 వారాల్లో దాదాపు 100 రెట్లు పెరుగుదల

3,980 మందికి కరోనా.. ముగ్గురి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమేణా పెరిగిపోతోంది. కేవలం 3 వారాల వ్యవధిలోనే దాదాపు 100 రెట్ల వరకూ క్రియాశీల కేసులు పెరగడం గమనార్హం. ఈ నెల 1న 317 క్రియాశీల కేసులుండగా.. తాజాగా సోమవారాని(24న)కి వీటి సంఖ్య 33,673కు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నెల 1న కోలుకున్న వారి శాతం 98.86శాతం నమోదు కాగా.. తాజాగా అది 94.89 శాతంగా ఉంది.

రాష్ట్రంలో కొత్తగా 3,980 మంది కొవిడ్‌ బారినపడగా.. 2,398 మంది కోలుకున్నారు. మహమ్మారి కోరల్లో చిక్కుకొని మరో 3 మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకూ 4,075 మంది కన్నుమూశారు. రాష్ట్రవ్యాప్తంగా 97,113 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,14,75,932కు పెరిగింది. ఈ నెల 24న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,429 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులతో పోల్చితే కేసుల్లో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. మిగిలిన జిల్లాల్లో వైరస్‌ ప్రభావం స్థిరంగా కొనసాగుతోంది. మేడ్చల్‌ మల్కాజిగిరి(344), రంగారెడ్డి(234), హనుమకొండ(159), ఖమ్మం(110), పెద్దపల్లి(99), యాదాద్రి భువనగిరి(96), సంగారెడ్డి(95), భద్రాద్రి కొత్తగూడెం(95), మహబూబ్‌నగర్‌(94), కరీంనగర్‌(92), నల్గొండ(88), మంచిర్యాల(86), సిద్దిపేట(82), నిజామాబాద్‌(77), సూర్యాపేట(75), మెదక్‌(67), వికారాబాద్‌(60), వరంగల్‌(53), జగిత్యాల(51), నాగర్‌కర్నూల్‌(50) జిల్లాల్లో కొత్తగా ఒక్కరోజులోనే 50కంటే అధికంగా కేసులు నిర్ధారణ అయ్యాయి.

రాష్ట్రంలో సోమవారం మరో 2,57,398 కొవిడ్‌ టీకాలను పంపిణీ చేశారు. రాష్ట్రం మొత్తమ్మీద సగటు తొలిడోసు 104 శాతం నమోదు కాగా.. మేడ్చల్‌లో 99 శాతం, నిజామాబాద్‌లో 97 శాతం, సూర్యాపేటలో 97 శాతం, కామారెడ్డిలో 94 శాతం, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 87 శాతం చొప్పున టీకాలను పంపిణీ చేశారు. ఈ అయిదు జిల్లాల్లో టీకాల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా అధికారులను ప్రజారోగ్య సంచాలకులు ఆదేశించారు.

ఏపీలో కొత్తగా 14,502 మందికి కొవిడ్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం 9నుంచి సోమవారం ఉదయం 9గంటల మధ్య  14,502 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మహమ్మారి బారినపడి ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 93,305 క్రియాశీల కేసులున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని