ఆర్టీసీలో భత్యానికి రాంరాం!

తెలంగాణ ఆర్టీసీపై మరో దఫా కరోనా మహమ్మారి ప్రభావం కనిపిస్తోంది. ఒమిక్రాన్‌ విజృంభణతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఆదాయం క్షీణిస్తోంది. ఈ నెల 24వ తేదీ వరకు టీఎస్‌ఆర్టీసీకి రూ.240 కోట్ల ఆదాయం వచ్చింది.

Published : 26 Jan 2022 03:57 IST

జనవరి జీతం నుంచి అధికారుల అలవెన్స్‌లకు కోత
ఉత్తర్వులు జారీ చేసిన ఎండీ సజ్జనార్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీపై మరో దఫా కరోనా మహమ్మారి ప్రభావం కనిపిస్తోంది. ఒమిక్రాన్‌ విజృంభణతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఆదాయం క్షీణిస్తోంది. ఈ నెల 24వ తేదీ వరకు టీఎస్‌ఆర్టీసీకి రూ.240 కోట్ల ఆదాయం వచ్చింది. రానున్న రోజుల్లో వైరస్‌ ప్రభావం పెరిగితే ఆదాయం మరింతగా తగ్గే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో సంస్థ పొదుపు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అధికారుల స్థాయిలో చెల్లించే అన్ని రకాల భత్యాల నిలిపివేతకు ఆదేశిస్తూ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ నెలలో ఇప్పటి వరకు రోజు వారీ ఆదాయం అత్యధికంగా మూడో తేదీన రూ.12.80 కోట్లు లభించగా ఈ నెల 15వ తేదీన అత్యల్పంగా రూ. 5.63 కోట్లు వచ్చింది. గడిచిన 24 రోజుల్లో 11 రోజుల్లో మాత్రమే రూ. పది కోట్లకుపైగా ఆదాయం లభించింది. ఆక్యుపెన్సీ సగటు 59 శాతం వరకు నమోదు అవుతోంది. సంస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్టీసీలో పొదుపు చర్యల పేరుతో కోతలు విధిస్తుండటం సాధారణమే. ఆ క్రమంలోనే ఫిబ్రవరి నెలలో ఇచ్చే జనవరి నెల జీతం నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు భత్యాలన్నింటినీ నిలుపుదల చేయాలని పేర్కొన్నారు.

వారికి మినహాయింపు

అయిదు విభాగాల అధికారుల భత్యాల చెల్లింపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. వారిలో డాక్టర్లు, వాహన సదుపాయం కల్పించని అధికారులు, క్లాస్‌-2 సూపర్‌వైజర్లు, సీనియర్‌ లా ఆఫీసర్‌, ఆర్టీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్ల కార్యదర్శులు, షెడ్యూల్స్‌ ఆధారంగా డిపో మేనేజర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని