పొలింగ్‌ నమోదు పెరగాలి

ఎన్నికల్లో తక్కువ ఓటింగ్‌ నమోదవుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యావంతులు, సంపన్నులు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉంటోందని, శక్తిమంతమైన భారత్‌ వంటి దేశంలో ఈ పరిస్థితి మారాలని

Updated : 26 Jan 2022 06:28 IST

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై చర్చ జరగాలి
ప్రధాని నరేంద్ర మోదీ

దిల్లీ: ఎన్నికల్లో తక్కువ ఓటింగ్‌ నమోదవుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యావంతులు, సంపన్నులు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉంటోందని, శక్తిమంతమైన భారత్‌ వంటి దేశంలో ఈ పరిస్థితి మారాలని ఆయన ఆకాంక్షించారు. ‘ఓకే దేశం-ఒకే ఎన్నిక’పై చర్చ జరగాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవమైన మంగళవారం నాడు ఆయన దేశ వ్యాప్తంగా భాజపా కార్యకర్తలను ఉద్దేశించి ఆడియో ద్వారా మాట్లాడారు. ‘‘తరచూ ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోంది. దీన్ని అధిగమించేందుకు వీలుగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’, ‘ఒకే దేశం-ఒకే ఓటర్ల జాబితా’ విషయమై యోచించాల్సి ఉంది. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఎన్నికల్లో పాల్గొనడం శుభపరిణామం. కానీ, మొత్తంగా ఇప్పటికీ ఓటింగ్‌ తక్కువగానే నమోదవుతోంది. ఈ విషయమై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఆలోచించాలి. 75% పోలింగ్‌ నమోదయ్యేలా భాజపా కార్యకర్తలు కూడా పనిచేయాలి. ఓటు వేయడమన్నది ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రజలు అందించే అత్యంత పవిత్రమైన విరాళం.

నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియతోనే సజీవ ప్రజాస్వామ్యం...

బలమైన, నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియతోనే సజీవ ప్రజాస్వామ్యం సాకారమవుతుందని మన రాజ్యాంగ నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో లేనన్ని అధికారాలు మన ఎన్నికల సంఘానికి దఖలుపరిచారు. నోటీసులు జారీ చేయడం దగ్గర్నుంచి అధికారులను బదిలీ చేయడం వరకూ ఎన్నో హక్కులు ఆ సంఘానికి ఉన్నాయి’’ అని మోదీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని