ఆపరేషన్‌ మహేశ్‌ బ్యాంక్‌

హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌పై నైజీరియన్లు అమెరికా, కెనడాల నుంచి సైబర్‌ దాడులు చేశారు. అక్కడి ఐపీ చిరునామాలతో మహేశ్‌ బ్యాంక్‌ ప్రధాన సర్వర్‌లోకి ప్రవేశించి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్లను కాజేశారు.

Published : 26 Jan 2022 03:57 IST

అమెరికా, కెనడా ఐపీ చిరునామాల నుంచి సర్వర్‌లోకి
వేగంగా స్పందించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌పై నైజీరియన్లు అమెరికా, కెనడాల నుంచి సైబర్‌ దాడులు చేశారు. అక్కడి ఐపీ చిరునామాలతో మహేశ్‌ బ్యాంక్‌ ప్రధాన సర్వర్‌లోకి ప్రవేశించి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్లను కాజేశారు. ఈ సైబర్‌ దాడి తీవ్రతను తగ్గించేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. 24 గంటలు పట్టే పనులను 5 గంటల్లోనే పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 11 గంటలకు తమ బ్యాంక్‌లోంచి నగదు నిల్వలు వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయంటూ డీజీఎం బద్రీనాథ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగానే ‘‘ఆపరేషన్‌ మహేశ్‌ బ్యాంక్‌’’ ప్రారంభమైంది. అప్పుడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లతో పాటు ఇతర అధికారులు సత్వరం స్పందించడంతో గంటల వ్యవధిలోనే రూ.3.50 కోట్లు సైబర్‌ నేరస్థుల బారిన పడకుండా ఆపగలిగారు.

నగదు నిల్వలు వేగంగా తగ్గడంతో...

ఏపీ మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్లోకి నైజీరియన్లు శనివారం రాత్రి ప్రవేశించారు. అప్పటినుంచి ఆదివారం సాయంత్రం వరకూ నిందితులు వేర్వేరు ఖాతాల్లోకి నగదు బదిలీ చేసుకున్నారు. బ్యాంక్‌ ఖాతాదారులకు, ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన నగదును సరి చూసుకునేందుకు బ్యాంక్‌ ప్రతినిధులు నగదు నిల్వలను పరిశీలించారు. నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.65 లక్షలు ఇలా నగదు వేర్వేరు ఖాతాలకు వెళ్లిందని గుర్తించారు. వెంటనే వారు అప్రమత్తమై బషీర్‌బాగ్‌లోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ ఠాణాకు వచ్చారు. రాత్రి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ సుదర్శన్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు సమాచారం ఇవ్వడంతో ఎస్సై మదన్‌ను పోలీస్‌ ఠాణాకు పంపించారు. ఆయన, కానిస్టేబుళ్లు సుదర్శన్‌, శ్రీకాంత్‌నాయక్‌లు వేగంగా స్పందించారు. సైబర్‌ పోర్టల్‌లో ఫిర్యాదును అప్‌లోడ్‌ చేసేందుకు, 27 బ్యాంకులకు సమాచారం ఇచ్చేందుకు ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌ డిజిటల్‌ సంతకాన్ని అప్పటికప్పుడు తెప్పించారు. అనంతరం ముగ్గురూ కలిసి 27 బ్యాంకులు, 128 బ్యాంక్‌ ఖాతాలకు మెయిల్స్‌ పంపించారు. సైబర్‌ నేరాలను అడ్డుకునేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన సైబర్‌ పోర్టల్‌లో నమోదు చేశారు. సోమవారం ఉదయం ఈ-మెయిల్‌ లేఖలను హైదరాబాద్‌లోని 27 బ్యాంకులకు పంపించారు.

అమెరికా.. కెనడా ఐపీలపై ఆరా..

సైబర్‌ నేరస్థులు నగదు బదిలీ చేసుకునేందుకు ఉపయోగించిన అమెరికా, కెనడాల ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌(ఐపీ) చిరునామాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇవి నిజమైనవేనా? లేక ప్రాక్సీ మెయిల్స్‌ (నకిలీ చిరునామాలు) ఉంటాయా? అని పరిశోధిస్తున్నారు. ఈ వివరాలు వస్తే.. ఎక్కడి నుంచి ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌ వినియోగించారన్నది కచ్చితంగా తెలుస్తుంది. ఆయా ఐపీ చిరునామాలు ప్రాక్సీవన్న భావనతోనే అసలు చిరునామాల కోసం వివరాలను సేకరిస్తున్నారు. ఇక సైబర్‌ నేరస్థులు రూ.12.90 కోట్లు నగదు బదిలీ చేసుకునేందుకు ఉపయోగించిన ఫోన్‌ నంబర్లు కూడా వేర్వేరు పేర్లతో ఉండటంతో సైబర్‌ నేరస్థులు విత్‌డ్రా చేసుకున్న ఏటీఎం కేంద్రాల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు ఏపీ మహేశ్‌ బ్యాంక్‌లోని వ్యక్తిగత ఖాతాలు హ్యాక్‌ కాలేదని డీజీఎం బద్రీనాథ్‌ తెలిపారు.  

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం

నారాయణగూడ, న్యూస్‌టుడే: మహేశ్‌ బ్యాంక్‌ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అదనపు కమిషనర్‌(నేర పరిశోధన) ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు. బ్యాంక్‌ ప్రధాన సర్వర్‌ హ్యాక్‌ ఎలా అయ్యిందో తెలుసుకునేందుకు 4 పత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని