మానవత్వం చాటుతున్న.. గాంధీ

కరోనా రోగులకు అత్యవసర ఆపరేషన్లు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి కొవిడ్‌ బాధితులకు

Published : 27 Jan 2022 03:55 IST

కొవిడ్‌ రోగులకు అత్యవసర ఆపరేషన్లు

వైద్యం అందించిన 5 రోజుల తరువాత శస్త్రచికిత్సలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: కరోనా రోగులకు అత్యవసర ఆపరేషన్లు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి కొవిడ్‌ బాధితులకు అత్యవసర ఆపరేషన్లు చేస్తూ మానవత్వాన్ని చాటుతోంది. కొవిడ్‌ సోకిన అయిదు రోజుల తరవాత రోగికి అవసరమైన ఆపరేషన్లు చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు పంపిస్తోంది. గడిచిన పదిహేను రోజుల్లో వంద మందికి ఇలాంటి అత్యవసర ఆపరేషన్లు చేశారు.

మొదటి, రెండు దశల్లో కరోనా బారినపడిన దాదాపు రెండు లక్షల మందికి గాంధీ ఆసుపత్రి చికిత్సలు అందించింది. ప్రస్తుత కరోనా మూడో దశలోనూ రోగులకు సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈసారి గాంధీని మొత్తం కొవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించకుండా 300 పడకలను మాత్రమే కేటాయించి  చికిత్సలు అందిస్తున్నారు.  మెదడు, ఇతర ఆపరేషన్లు చేయాల్సిన సమయంలో చాలా మంది కరోనా బారినపడుతున్నారు. ఇలాంటి వారిని చేర్చుకోవడానికి కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు విముఖత చూపుతున్నాయి. అత్యవసరమైనా సరే.. ఆపరేషన్‌ చేయలేమని చేతులెత్తేస్తున్నాయి. ఇలాంటి వారికి అండగా నిలుస్తోంది గాంధీ ఆసుపత్రి. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు కొన్ని రోజుల కిందట వైద్యులతో చర్చించి అత్యవసరమైన వారికి ఆపరేషన్లు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాంటి రోగుల కోసం ప్రతి విభాగంలో 10 నుంచి 30 పడకలు ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స అవసరమై, కొవిడ్‌ బారినపడిన రోగులు ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 70 మంది  ఉన్నారు. వారిలో 20 మంది అయిదేళ్లలోపు చిన్నారులు, 40 మంది గర్భిణులు. వీరందరికీ శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి, ఆరోగ్యం విషమిస్తున్న వారికి మాత్రం వైరస్‌ లక్షణాలు తగ్గిన తరువాతే ఆపరేషన్లు చేయాలని వైద్యులు భావిస్తున్నారు.

వంద మందికి అత్యవసర ఆపరేషన్లు

మహమ్మారి సోకిన వారికి అత్యవసర చికిత్సలు అందించేందుకు గాంధీలో వైద్య బృందాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పదిహేను రోజుల్లో వంద మంది కరోనా బాధితులకు చిన్న, పెద్ద ఆపరేషన్లు చేశాం. ఐసీఎంఆర్‌, డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం కొవిడ్‌ బాధితులకు 5 లేదా 7 రోజుల చికిత్స సరిపోతుంది. తరవాత మళ్లీ వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో 180 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.

- డాక్టర్‌ రాజారావు, సూపరిండెంటెంట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని