రూ.1,66,384 కోట్లతో రుణప్రణాళిక

రాష్ట్రానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన రూ.1,66,384 కోట్ల రుణ ప్రణాళికను నాబార్డ్‌ విడుదల చేసింది. గత ఏడాది కంటే ఇది 15 శాతం అదనం. వ్యవసాయ అనుబంధ రంగాలకు గత ఏడాది రూ.83,368 కోట్ల రుణాలు లక్ష్యం కాగా ఈ ఏడాది రూ.1,01,173 కోట్లుగా నిర్దేశించారు.

Published : 28 Jan 2022 05:22 IST

గత ఏడాది కంటే 15 శాతం ఎక్కువ  
పంట రుణాలకు రూ.67,863 కోట్లు
విడుదల చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన రూ.1,66,384 కోట్ల రుణ ప్రణాళికను నాబార్డ్‌ విడుదల చేసింది. గత ఏడాది కంటే ఇది 15 శాతం అదనం. వ్యవసాయ అనుబంధ రంగాలకు గత ఏడాది రూ.83,368 కోట్ల రుణాలు లక్ష్యం కాగా ఈ ఏడాది రూ.1,01,173 కోట్లుగా నిర్దేశించారు. ఈ ఏడాది రూ.67,863 కోట్ల పంటరుణాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి జి.నిరంజన్‌రెడ్డి గురువారం తన నివాసంలో రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టెస్కాబ్‌ ఛైర్మన్‌ రవీందర్‌రావు, వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు, ఎస్సెల్బీసీ డీజీఎం మోహన్‌దాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుచేయండి
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో వివిధ రంగాల అవసరాలను గుర్తించి రుణాలను ఇవ్వాలన్నారు. రైతులు వరి సాగు నుంచి ఆయిల్‌పామ్‌ సాగుకు మళ్లాలని కోరారు. పామోలిన్‌ సాగుకు రుణాలను పెంచాలని బ్యాంకర్లకు  సూచించారు. కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.  వ్యవసాయరంగంలో కృత్రిమ మేధ వినియోగం, రైతు ఉత్పాదక సంఘాలకు ఆర్థిక తోడ్పాటు కీలకమైన అశంగా గుర్తించినట్లు నాబార్డ్‌ సీజీఎం వై.కె.రావు పేర్కొన్నారు. అయిల్‌పామ్‌ సాగుకు నాబార్డ్‌ తోడ్పాటును ఇస్తుందని తెలిపారు. డ్రోన్‌ ఆధారిత సాంకేతికత వ్యవసాయానికి యూనిట్‌ కాస్ట్‌ నిర్ణయించేందుకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో వివిధ రంగాలు దెబ్బతిన్నా రాష్ట్రాన్ని వ్యవసాయం ఆదుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. రైతుల రాబడి పెంచేందుకు దోహదపడే అంశాల్లో కీలకమైన పాడిపరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సూచించారు. కొత్త మార్గదర్శకాల మేరకు చిన్న, మధ్య తరగతి రైతులకు రుణాలను పెంచాలని ఆర్‌బీఐ ప్రాంతీయ డైరెక్టర్‌ నిఖిల కోరారు. ప్రాధాన్య రంగాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు కలసికట్టుగా వ్యవహరించాలన్నారు. గ్రామీణాభివృద్ధిలో చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, విద్య, హౌసింగ్‌, మౌలిక సదుపాయాలకు రుణాలు కీలకంగా ఉంటాయని ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌ అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వడం లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని