ముగుస్తున్న గడువు.. దరఖాస్తుకు బరువు!

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన ఫీజులకు దరఖాస్తులు ఆశించిన స్థాయిలో అందలేదు. ఈ నెల 31తో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు దూరంగా ఉన్నారు. కరోనా వల్ల 2021-22 విద్యాసంవత్సరానికి

Published : 28 Jan 2022 04:41 IST

ఉపకారవేతనాల దరఖాస్తు చివరి తేదీ 31
ఇప్పటికీ 3 లక్షల మంది దూరం
గడువు పెంచితేనే విద్యార్థులకు ప్రయోజనం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన ఫీజులకు దరఖాస్తులు ఆశించిన స్థాయిలో అందలేదు. ఈ నెల 31తో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు దూరంగా ఉన్నారు. కరోనా వల్ల 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల్లో జాప్యం చోటుచేసుకోవడం, ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమవడం తదితర కారణాలతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ ఏడాది కొత్తగా కోర్సుల్లో చేరిన (ఫ్రెషర్‌), పునరుద్ధరణ (రెన్యువల్‌) విద్యార్థులు కలిపి దాదాపు 12.6 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేశారు. అయితే, ఇప్పటి వరకు కేవలం 9.64 లక్షల దరఖాస్తులు మాత్రమే సంక్షేమ శాఖలకు అందాయి.

సాంకేతికతకు దూరంగా..
ఒకసారి కోర్సులో చేరిన విద్యార్థి ప్రతియేటా పునరుద్ధరణ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయినా ఈ ప్రక్రియ ఇంతవరకు పూర్తవలేదు. ఉపకారవేతనాలు, బోధన ఫీజుల పునరుద్ధరణ కోసం దరఖాస్తు, వివిధ పత్రాల స్కానింగ్‌ ఖర్చుల కింద ఒక్కో విద్యార్థి ఏటా రూ.300 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించి, విద్యార్థుల పునరుద్ధరణ దరఖాస్తు ప్రక్రియను సులభం చేయడానికి ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని భావించింది. ఈ ప్రక్రియ పూర్తవకపోవడంతో విద్యార్థులు ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2021-22 ఏడాది 7.97 లక్షల మంది విద్యార్థులు పునరుద్ధరణ కోసం దరఖాస్తులు సమర్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 6.32 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

మార్చి 31 వరకు పొడిగింపు?
ఉపకారవేతనాల దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించాలని ఎస్సీ సంక్షేమ శాఖ భావిస్తోంది. ఈ మేరకు గడువు పెంపునకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రవేశాల్లో జాప్యం, కరోనా కారణంగా మిగిలిన శాఖలూ దరఖాస్తు గడువును పెంచితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని