సగం..సగం.. పనులే

రూ.కోట్లు వ్యయం చేస్తున్నారు... ఏళ్లుగడుస్తున్నా పనులు పూర్తి కావడంలేదు... ప్రజాధనాన్ని మట్టిపాలు చేసి పురపాలక అధికార యంత్రాంగం చోద]్యం చూస్తోంది. అభివృద్ధి పనులకు నిధుల కొరత సాధారణంగా ఉండే అంశమే అయినా... డబ్బులున్నా వ్యయం చేయలేక కొన్నిచోట్ల ఉదాసీనంగా ఉంది యంత్రాంగం. రాష్ట్రంలో పలు నగరాలు

Updated : 28 Jan 2022 05:12 IST

నగరాలు, పురపాలికల్లో అర్ధంతరంగా ఆగిన పురోగతి
నిధులులేక కొన్నిచోట్ల...నిధులున్నా చాలాచోట్ల కొనసాగుతున్న తాత్సారం
ఈనాడు - హైదరాబాద్‌

రూ.కోట్లు వ్యయం చేస్తున్నారు... ఏళ్లుగడుస్తున్నా పనులు పూర్తి కావడంలేదు... ప్రజాధనాన్ని మట్టిపాలు చేసి పురపాలక అధికార యంత్రాంగం చోద]్యం చూస్తోంది. అభివృద్ధి పనులకు నిధుల కొరత సాధారణంగా ఉండే అంశమే అయినా... డబ్బులున్నా వ్యయం చేయలేక కొన్నిచోట్ల ఉదాసీనంగా ఉంది యంత్రాంగం. రాష్ట్రంలో పలు నగరాలు, పురపాలక పట్టణాల్లో అనేక చోట్ల అసంపూర్ణ పనులు దర్శనమిస్తున్నాయి. ప్రణాళికాలోపం, నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

14 ఏళ్లుగా..కరీంనగర్‌ భూగర్భ డ్రైనేజీ పనులు
14 ఏళ్లయినా కరీంనగర్‌ భూగర్భ మురుగునీటి పనులు కొలిక్కిరాలేదు. 2017లో  పూర్తయినా ఇంటింటి నుంచి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో పూర్తిగా వినియోగంలోకి రాలేదు. ఇక్కడ భూగర్భ మురుగునీటి శుద్ధి పనులకు 2008లో శంకుస్థాపన చేశారు. మొదటగా రూ.84 కోట్లు, 2017లో అదనంగా రూ.25 కోట్లు వెచ్చించారు. ఆరేళ్ల కిందట పనులు పూర్తి కాగా దీన్ని ఉపయోగించుకోవడానికి వీలుగా 319.5 కిలోమీటర్ల పొడువునా పైపులైన్లు వేసి మ్యాన్‌హోల్‌ ఛాంబర్లు, ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లు నిర్మించారు. ఇళ్ల నుంచి మురుగునీటిని శుద్ధి కేంద్రానికి తరలించడానికి ఇంటింటా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. మొత్తం 55 వేల ఇళ్లకు ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లు నిర్మించాల్సి ఉండగా 9,214 మాత్రమే పూర్తిచేశారు. 3,520 ఇళ్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. నిధులు లేక పని ఆగిపోయింది. ఎస్టీపీ సామర్థ్యం 38మిలియన్‌ లీటర్ల్లు (ఎంఎల్‌డీ) కాగా ప్రస్తుతం రెండు ఎంఎల్‌డీల నీటిని శుద్ధి చేసి చెరువుల్లోకి పంపిస్తున్నారు.
* మంచిర్యాలలో 2018-19లో రూ.30 కోట్లతో మంజూరైన అభివృద్ధి పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. రాముని చెరువు పార్కు సుందరీకరణకు మూడున్నరేళ్ల క్రితం రూ.3.5 కోట్లు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదు.
* జనగాంలో టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.30 కోట్లతో చేపట్టిన పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. అరకొరగా.. అర్ధంతరంగా డివైడర్ల పనులు మిగిలిపోయాయి.  

మహిళాసాధికారత..అయిదేళ్లుగా పిల్లర్లకే పరిమితం
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరిఖనిలో మహిళాసాధికార భవనం, పార్కు నిర్మాణాన్ని అయిదేళ్ల క్రితం ప్రారంభించారు. మహిళాసాధికార భవనానికి రూ.8 లక్షలు వ్యయం చేసినా ఆ తర్వాత నిధుల కొరతతో ఆపేశారు. ఇది పిల్లర్లకే పరిమితం కాగా పార్కు పనులు శంకుస్థాపన వద్దే ఆగిపోయాయి.  
* నిధుల కొరత.. కోర్టు వివాదాలతో మెదక్‌లో రూ.4 కోట్లతో చేపట్టిన రహదారి విస్తరణ పనులు రెండున్నరేళ్లుగా జరగడం లేదు.
నిధుల కొరత.. కోర్టు వివాదాలతో మెదక్‌లో రూ.4 కోట్లతో చేపట్టిన రహదారి విస్తరణ పనులు రెండున్నరేళ్లుగా జరగడం లేదు.
* మిర్యాలగూడ పురపాలక సంఘంలో ఏళ్లయినా భూగర్భడ్రైనేజీ పనులు పూర్తికాలేదు. 2016లో రూ.6 కోట్ల వ్యయ అంచనాతో ట్యాంక్‌బండ్‌ పనులు ప్రారంభించారు. రూ.3 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వం అదనంగా రూ.2 కోట్లు కేటాయించినా పనుల జాడ లేదు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎస్‌.జైపాల్‌రెడ్డి ఉన్నపుడు శంకుస్థాపన చేసిన మినీ రవీంద్రభారతి పనులు ఏళ్లు గడుస్తున్నా కొనసాగుతూనే ఉన్నాయి.

నిజామాబాద్‌లో రూ.231 కోట్లు ఖర్చయినా దక్కని ఫలితం
జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌లో భూగర్భ డ్రైనేజీ కాల్వల నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం పూర్తయినా వినియోగంలోకి రాలేదు. రోజుకు 46 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి సామర్థ్యంతో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏడు ఎంఎల్‌డీల మురుగునీరు మాత్రమే శుద్ధి అవుతోంది. భూగర్భ మురుగునీటి వ్యవస్థకు రూ.231 కోట్లు వ్యయం చేసినా వినియోగంలోకి రాలేదు. నిధుల కొరతతో ఇళ్ల నుంచి మురుగును ప్రధాన మురుగునీటి కాలువలతో అనుసంధానం చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని