EPFO:‘సర్వర్‌’ సమస్యకు పరిష్కారమెప్పుడు?

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఈపీఎఫ్‌వో కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సేవలు

Updated : 29 Jan 2022 04:37 IST

నెలన్నరగా ఈపీఎఫ్‌వో చందాదారుల ఇబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఈపీఎఫ్‌వో కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సేవలు పొందేలా పోర్టల్‌ అందుబాటులోకి తీసుకువచ్చినా గత నెలన్నర రోజులుగా సర్వర్‌ సమస్యలు తలెత్తాయి. ఎప్పుడు సమస్య పరిష్కారమవుతుందో తెలియని పరిస్థితి. దీంతో రోజుల తరబడి సాంకేతిక సమస్యలతో వేతన జీవులు, కార్మికులకు సేవలు నిలిచిపోయాయి. చివరకు అత్యవసరానికి నగదు ఉపసంహరణ చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈపీఎఫ్‌ ఖాతాల్లో డబ్బు ఉన్నప్పటికీ ఇంటి నిర్మాణం, చికిత్సలు, పిల్లల ఉన్నత విద్య, వివాహం, కరోనా ఉపసంహరణలు చేసుకోలేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈపీఎఫ్‌వో సేవలకు ఈ-నామినేషన్‌ తప్పనిసరి చేశారు. దాంతో ఒక్కసారిగా లక్షల మంది ప్రతిరోజూ పోర్టల్‌ను సందర్శిస్తుండటంతో తరచూ మొరాయిస్తోంది. ప్రస్తుతం దాదాపు ఏడు కోట్ల మంది చందాదారుల్లో 52 లక్షల మంది ఈ-నామినేషన్‌ పూర్తయింది.

పోర్టల్‌లో సమస్యలివీ..

* ఈపీఎఫ్‌వో మెంబర్‌పోర్టల్‌లో యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌లో సమస్యలు
* పేజీ తెరుచుకున్నా, వివరాలు నమోదు చేసిన వెంటనే సర్వర్‌డౌన్‌ డౌన్‌
* ఈ-నామినేషన్‌ తరువాత ఈ-సిగ్నేచర్‌కు సీ-డాక్‌ నుంచి సాంకేతిక సమస్యలు
* ఈ-నామినేషన్‌ పూర్తయ్యాకే మిగతా సర్వీసులకు అనుమతించడంతో ఆర్థిక కష్టాలు
* సర్వర్‌ సమస్యలతో అత్యవసర సమయాల్లో క్లెయిమ్‌లు దాఖలుకు వీల్లేని దుస్థితి

ఎందుకీ సమస్య...!

చందాదారుల ఖాతాల్లో ఈ-నామినేషన్‌(వారసుల) వివరాలను ఈపీఎఫ్‌వో తప్పనిసరి చేసింది. గతంలో పలుమార్లు సూచించినా చాలా మంది చందాదారులు చేసుకోలేకపోయారు. డిసెంబరు 31 చివరి తేదీగా నిర్ణయించడంతో డిసెంబరు 15 నుంచి సర్వర్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. సర్వర్‌ తెరుచుకోలేదు. దీంతో గడువు తరువాత కూడా ఈ-నామినేషన్‌ చేసుకోవచ్చని ఈపీఎఫ్‌వో సూచించింది. అయితే ఈ-నామినేషన్‌ చేసిన వారికి మాత్రమే ఆన్‌లైన్‌ సేవలు పొందేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. దీంతో ఈ-నామినేషన్‌ తప్పనిసరి కావడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

ఫిర్యాదు చేసినా...

సర్వర్‌ సమస్య ఎప్పటిలోగా పరిష్కారమవుతుందో ఆ సంస్థ చెప్పడం లేదు. ఇదే విషయమై ప్రతిరోజూ వేల మంది చందాదారులు ట్విటర్‌  ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలిస్తున్న ఈపీఎఫ్‌వో అధికారులు ‘‘ఈ సమస్యపై ఐటీ విభాగంతో మాట్లాడుతున్నాం’’ అంటున్నారే తప్ప, సమస్య పరిష్కారం కావడం లేదు. మరోపక్క ఈ-నామినేషన్‌ వెంటనే పూర్తిచేయాలంటూ చందాదారులకు ఈపీఎఫ్‌వో ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని