కళ తప్పిన పసుపు!

రాష్ట్రంలో పసుపు పంట సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకవైపు వర్షాలతో తెగుళ్లు వ్యాప్తి చెంది దిగుబడులు తగ్గుతుండగా, ఇదే సమయంలో మార్కెట్లో పంటకు ధరలు తగ్గడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

Published : 29 Jan 2022 04:05 IST

పడిపోతున్న ధర

రైతుకు నష్టాల భారం

అధిక వర్షాలు, తెగుళ్లతో దెబ్బతిన్న పంట

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పసుపు పంట సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకవైపు వర్షాలతో తెగుళ్లు వ్యాప్తి చెంది దిగుబడులు తగ్గుతుండగా, ఇదే సమయంలో మార్కెట్లో పంటకు ధరలు తగ్గడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం క్వింటా కొత్త పసుపు ధర రూ.300 దాకా తగ్గి రూ.8411కి చేరింది. కనిష్ఠ ధర క్వింటాకు రూ.4501 మాత్రమే ఇచ్చారు. ఎక్కువ మంది రైతులకు సగటు ధర రూ.5333 చొప్పున వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లకు వస్తున్న కొత్త పసుపు పంటలో తేమ అధికంగా ఉంటోందని వ్యాపారులు ధర బాగా తగ్గించేస్తున్నారు. రాష్ట్రంలో పసుపు సాగవుతున్న కొన్ని జిల్లాల్లో సాధారణంకన్నా 30 నుంచి 50 శాతం అదనంగా కురిసిన వర్షాలతో నేలలో తేమ పెరిగి దుంపకుళ్లు తెగులు వ్యాపించింది. ఈ కారణంగా పంట దిగుబడి 20 శాతానికి పైగా తగ్గవచ్చని ‘భారత పసుపు వ్యాపారుల సంఘం’(ఐటీఏ) అంచనా వేసింది. సాధారణంగా తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్ర మార్కెట్లలో ధరలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం అక్కడే తక్కువగా ఉంది. క్వింటా ధర రూ.9 వేలకుపైగా ఉంటేనే రైతుకు గిట్టుబాటవుతుందని రాష్ట్ర ఉద్యానశాఖ అంచనా. ‘‘సాధారణంగా పసుపు సాగుకు ఎకరాకు రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. 20-25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ధరలు పుంజుకోకపోతే పెట్టుబడుల్లో సగం కూడా వచ్చే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులను ప్రోత్సహించాలని తెలంగాణ ఉద్యానశాఖ కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదు. ‘‘ఈ పంటకు ఎంత ధర ఇవ్వాలనేది వ్యాపారుల ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటోంది. ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్రకన్నా ఎప్పుడూ క్వింటాకు రూ.వెయ్యి నుంచి 3 వేల దాకా తక్కువ చెల్లిస్తున్నారు. అందుకే ఏటా పంట విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది’’ అని రైతులు వాపోతున్నారు.

వేచిచూస్తే ధరలు పెరగొచ్చు

‘‘వర్షాలతో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ పంట దిగుబడులు తగ్గాయి. 2020లో దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లకు 97 లక్షల బస్తాల పసుపు వచ్చింది. ఒక్కో బస్తా 50 కిలోలుంటుంది. ఈ ఏడాది 94.20 లక్షల బస్తాలకు మించి రాకపోవచ్చని భారత పసుపు వ్యాపారుల సంఘం అంచనా. ఇందులో తెలంగాణలోనే అత్యధికంగా 25.90 లక్షల బస్తాలుండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మళ్లీ పసుపు వినియోగం పెరిగి ఎగుమతులు పుంజుకునే అవకాశాలున్నాయి. రాష్ట్ర రైతులు కొత్త పసుపు పంటను ఈ నెలాఖరు నుంచి మార్కెట్లకు తేవడం ఆరంభిస్తారు. వారు వేచిచూస్తే కొంతకాలానికి ధరలు పెరిగే అవకాశాలున్నాయి’’ అని ఐటీఏ ప్రతినిధులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని