Updated : 12/11/2021 06:49 IST

 Winter Problems: గుండెకు చలి

15-20 శాతం అదనపు కేసులు
60 ఏళ్లు దాటిన వారిలో ముప్పు
జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
ఈనాడు - హైదరాబాద్‌

లి క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్‌ సహా నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో 13 డిగ్రీలకు పడిపోయింది. రానున్న రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు దాడిచేసే ముప్పు ఎక్కువ ఉంటుందని, ముఖ్యంగా ఇతర రోజులతో పోల్చితే ఈ కాలంలో హృద్రోగ సమస్యలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ‘‘చల్లని నీటిలో చేతులు పెడితే..కొద్ది నిమిషాల్లోనే చేతులు పాలిపోయినట్లుగా తయారవుతాయి. మళ్లీ బయటపెట్టిన కాసేపటికి సాధారణ స్థితికి చేరుకుంటాయి. హృదయ నాళాల్లోనూ ఇదే జరుగుతుంది. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఎక్కువ సమయం చలిలో గడిపితే గుండె లోపల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అంతిమంగా ఆ ప్రభావం గుండెపై పడుతుంది. కొందరిలో తెలియకుండానే గుండెకు రక్తాన్ని సరఫరాచేసే నాళాల్లో 20-30 శాతం పూడికలు ఉంటాయి. అప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిపేస్తున్నప్పటికీ, చలి వాతావరణంలో ఎక్కువసేపు గడిపితే ఆ పూడికలు తాత్కాలికంగా 60-70 శాతానికి పెరుగుతాయని’ నిమ్స్‌ ఆసుపత్రి హృద్రోగ నిపుణులు డాక్టర్‌ ఆర్వీకుమార్‌ తెలిపారు. అలాంటి పరిస్థితులు ఒక్కోసారి గుండెపోటుకు దారితీసే ప్రమాదమూ ఉంటుందని ఆయన వివరించారు. సాధారణ రోజులతో పోలిస్తే నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో 15-20 శాతం మంది రోగులు అదనంగా గుండె సమస్యలతో నిమ్స్‌కు వస్తుంటారన్నారు. ఇప్పటికే హృద్రోగ, ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా వేకువజామున 4-6 గంటల మధ్య, రాత్రి సమయాల్లో బయట తిరిగే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.


ముప్పు తప్పాలంటే...

డాక్టర్‌ ఆర్వీకుమార్‌

చలి కాలంలో ఆహారం, తాగే నీటి ద్వారా అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. ఈ కాలంలో గోరువెచ్చని నీటిని తాగడం మంచిది.

చిన్న పిల్లలపై నిమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులు దాడిచేస్తాయి. నెలలు నిండని శిశువులు, అప్పుడే పుట్టిన పిల్లలను తరచూ తాకే తల్లిదండ్రులు లేదా ఇతరులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. చేతులను సబ్బుతో కడుక్కున్న తర్వాతే పట్టుకోవాలి.

ఈ కాలంలో పొగమంచు ఎక్కువ. కాలుష్య కారకాలు గాలిలో ఎక్కువ సమయం ఉంటాయి. ఈ కారణంగా ఉదయపు నడకకు వెళ్లే వారు శ్వాసకోశ వ్యాధుల బారినపడే అవకాశాలుంటాయి. ఎండ వచ్చాక లేదా సాయంత్రం సమయాల్లో వ్యాయామం మంచిది.

పిల్లలను బడికి పంపే సమయంలో ఉన్ని దుస్తులు ధరింపజేయాలి. కాచి చల్లార్చిన నీరు, పరిశుభ్రమైన ఆహారం అందించాలి.

వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, మధుమేహం, క్యాన్సర్‌ ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, అవయవ మార్పిడి చేయించుకున్న వారు చలి కాలంలో త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు వైద్యుల సలహాతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని