Updated : 19/11/2021 04:44 IST

Tirupati rains: ‘కొండ’పోత

తిరుపతి, తిరుమలను ముంచెత్తిన వానలు
భారీ వరదలతో  చెరువులను తలపించిన రహదారులు
అడుగుతీసి  అడుగు వేయలేని పరిస్థితి
చిత్తూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు
కడప, నెల్లూరు జిల్లాల్లోనూ వరద బీభత్సం

తిరుమల శ్రీవారి మాడ వీధుల్లో భారీ వరద

ఈనాడు డిజిటల్‌, తిరుపతి-న్యూస్‌టుడే బృందం: భారీ వర్షాలతో తిరుపతి నగరం అతలాకుతలమైంది. రహదారులన్నీ చెరువులను తలపించాయి. చరిత్రలో లేని విధంగా ఎగువ ప్రాంతాలనుంచి వరద వస్తుండటంతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. మోకాలి లోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగించారు. వరదను బయటకు తీసుకెళ్లే కాలువల స్థాయి సరిపోక కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. తిరుపతితో పాటు చిత్తూరు జిల్లావ్యాప్తంగానూ భారీ వర్షాలు భయపెట్టిస్తున్నాయి. కడప, నెల్లూరు జిల్లాల్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

తిరుపతి.. ఎయిర్‌బైపాస్‌ రోడ్డులో వరద

తిరుపతి జలసంద్రం

కుండపోత వానతో తిరుపతి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తిరుపతిలోని పలు కాలనీలను వరద చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లన్నీ మునిగాయి. శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలోకి వరద చేరింది. రైల్వే అండర్‌బ్రిడ్జిల వద్ద భారీగా నీరు చేరడంతో మూసేసి ట్రాఫిక్‌ మళ్లించారు. స్థానిక డీమార్ట్‌ వద్ద ప్రజలు తాడు సాయంతో అతికష్టమ్మీద రహదారి దాటాల్సి వచ్చింది. సీకాం కళాశాల వద్ద మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరిన వాహనదారులు మూడు కి.మీ.దూరంలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరడానికి ఐదు గంటల సమయం పట్టింది. లక్ష్మీపురంలో 4.30కు బయలుదేరిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కి.మీ.దూరంలోని అన్నమయ్య కూడలికి వేర్వేరు మార్గాల్లో వెళ్లాల్సి వచ్చింది.

చిత్తూరు జిల్లాలో..

తిరుపతి సమీపంలోని ఎన్టీఆర్‌, కల్యాణి డ్యాంలలోకి భారీగా వరద వస్తుండడంతో గేట్లు ఎత్తివేశారు. 30ఏళ్ల తరువాత కల్యాణి డ్యాం మూడో గేటును కూడా తెరిచి 10వేల క్యూసెక్కులను వదిలారు. దీంతో కల్లేటి వాగు, సువర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చిత్తూరు జిల్లావ్యాప్తంగా పలు చెరువులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పీలేరు బస్టాండు మునిగింది. గురువారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 9గంటల వ్యవధిలో జిల్లాలో సగటు వర్షపాతం 7.2 సెం.మీ.గా నమోదైంది. చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి, పూతలపట్టు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల ముందే జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీనికి భిన్నంగా కొన్ని ప్రైవేటు విద్యాలయాలను నడపడంతో విద్యార్థులు ముంపులో అవస్థలు పడ్డారు.

చిత్తూరులో ప్రైవేటుస్కూల్‌ బస్సు దొడ్డిపల్లి రైల్వే దిగువ వంతెనలో నిలిచిన నీళ్లలో చిక్కుకుంది. అప్రమత్తమైన స్థానికులు 20 మంది చిన్నారులను రక్షించారు. పాలసముద్రం కళాశాల విద్యార్థులు స్వగ్రామాలను చేరే దారి లేనందున అధికారుల బృందంవారిని ప్రత్యేక వాహనంలో తమిళనాడు మీదుగా తరలించారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలోకి నీరు చేరింది.

తిరుమల క్యూలో వర్షపు నీరు

తిరుమలలోనూ..

తిరుమలలో మ్యూజియం వెనకవైపు నుంచి వస్తున్న వరద నాలుగు మాడవీధులను ముంచెత్తి బురద పేరుకుపోయింది. అదనపు ఈవో, జేఈవో బంగ్లాలు, క్యూలైన్లలోకి నీరు చేరింది. సర్వర్‌రూమ్‌లోకి నీరు చేరడంతో సర్వర్‌ను ఆపి మాన్యువల్‌గా టికెట్లను పరిశీలించారు. కనుమ మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో సాయంత్రం 4.30 నుంచి కొండపైకి భక్తుల రాకపోకలు నిలిపేశారు. నడకదారులను శుక్రవారం కూడా మూసేస్తున్నట్లు తితిదే ప్రకటించింది.

విమానాలు వెనక్కి..!

పలు ప్రాంతాల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు వాతావరణం అనుకూలించక తిరిగి వెళ్లాయి. కొన్నింటిని బెంగళూరుకు మళ్లించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


కడప జిల్లాలో..

కడప, న్యూస్‌టుడే, ఈనాడు డిజిటల్‌- నెల్లూరు: కడప జిల్లాలో ప్రధాన నదులు పాపఘ్ని, చెయ్యేరు, బహుద, పెన్నా, బుగ్గవంక నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వెలిగల్లు, పీబీఆర్‌, అన్నమయ్య, పింఛ, మైలవరం జలాశయాల గేట్లు ఎత్తి నదులకు నీటిని విడుదల చేశారు. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కడపలో స్థానికులు కొందరు సొంతంగా ఖాళీ నీటి క్యాన్లతో తెప్పలు తయారుచేసుకొని వాటిపై రాకపోకలు సాగించారు.

సోమశిలలో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1.35 లక్షల క్యూసెక్కులు ఉంది. దాంతో జలాశయం 10 గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కులను వదిలారు. సూళ్లూరుపేటలో దొండ్ల కాలువ పొంగిపొర్లడంతో దాదాపు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. చేజర్ల మండలం యనమదల వద్ద నల్లవాగు వంతెనపై అయిదడుగుల మేర వరద ప్రవహిస్తోంది. మర్రిపాడు మండలంలో పొంగి ప్రవహిస్తున్న కేతామన్నేరు, బొగ్గేరు వరద రోడ్డుపైకి రావడంతో 13 గ్రామాలకు అంతరాయం కలిగింది.

తిరుమల రెండో ఘాట్‌లో 13 ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. పది జేసీబీలతో రాళ్లను తొలగిస్తున్నారు.

తిరుమలలో నారాయణగిరి అతిథి గృహాల వద్ద కొండ చరియలు విరిగిపోడటంతో 3గదులు ధ్వంసమయ్యాయి. భక్తులు ఎవరూ గదుల్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నారాయణగిరి, ఎస్వీ అతిథిగృహాల్లో ఉన్న భక్తులను ఇతర ప్రాంతాలకు తరలించారు.

తిరుమల కనుమ రహదారిలో విరిగిపడ్డ కొండచరియలు


 Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని