Konijeti Rosaiah: దిగంతాలకు దిగ్గజం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా సేవలు అందించిన రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు, ఉపన్యాస చతురుడు కొణిజేటి రోశయ్య

Updated : 05 Dec 2021 05:13 IST

రాజకీయ దురంధరుడు రోశయ్య కన్నుమూత

భౌతికకాయం వద్ద సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, సీఎం కేసీఆర్‌ నివాళులు

సోనియా, రాహుల్‌ సంతాపం

తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాపదినాలు

ఈనాడు, హైదరాబాద్‌- అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా సేవలు అందించిన రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు, ఉపన్యాస చతురుడు కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. శనివారం ఉదయం ఇంట్లో ఆయనకు బీపీ తగ్గి పల్స్‌ పడిపోగా.. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రికి తరలించారు. దారిలోనే ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

రోశయ్యకు భార్య శివలక్ష్మి, కుమారులు శివ, మూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు.ఆయన మృతి సమాచారం తెలియడంతో పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రోశయ్య నివాస ప్రాంతమైన అమీర్‌పేట ధరమ్‌కరం రోడ్డులో విషాద ఛాయలు అలముకున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. కుమారులు, కుమార్తెతో మాట్లాడి ఓదార్చారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి కారణంగా శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు సంతాప దినాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ప్రకటించాయి.

రోశయ్య పార్థివదేహానికి పుష్పాంజలి ఘటిస్తున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, సీఎం కేసీఆర్‌,

పక్కన బుద్ధప్రసాద్‌, కేవీపీ, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని తదితరులు

నేడు గాంధీభవన్‌కు భౌతికకాయం

ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు రోశయ్య భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలియ చేశాయి. మధ్యాహ్నం 12.30 వరకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆదివారం గాంధీభవన్‌లో రోశయ్యకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు తూంకుంట పురపాలకపరిధి దేవరయాంజల్‌లోని రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. వీటిని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అంత్యక్రియలకు తమ తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరవుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి వెల్లంపల్లి శనివారం సాయంత్రమే హైదరాబాద్‌ చేరుకొని రోశయ్యకు నివాళులు అర్పించారు.

తరలివచ్చిన నేతలు

రోశయ్య భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఉదయం 10.30గంటలకు ఆయన నివాసానికి తరలించారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు తదితరులు నివాళి అర్పించారు. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు.

రోశయ్య సతీమణిని పరామర్శిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు


రోశయ్య కుమారుడితో మాట్లాడిన సోనియా

రోశయ్య మరణం పట్ల జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.రోశయ్య మరణవార్తను రాజ్యసభ  మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వారికి తెలియజేశారు. రోశయ్య కుమారుడు శివసుబ్బారావుతో సోనియా ఫోన్‌లో మాట్లాడి ప్రగాఢ సంతాపం తెలిపారు.


కాంగ్రెస్‌ పార్టీ పతాకం అవనతం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య మరణంతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్త తెలియగానే గాంధీభవన్‌పై పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ముఖ్యనేతలు ఆయన చిత్రానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీభవన్‌తో రోశయ్యకు విడదీయలేని సంబంధం ఉందని నేతలు మననం చేసుకున్నారు. ఆయన ఏ పదవిలో ఉన్నప్పటికీ దాదాపు ప్రతిరోజూ గాంధీభవన్‌కు వచ్చేవారని గుర్తుచేసుకున్నారు. అందరినీ పలకరిస్తూ కలుపుగోలుగా ఉండేవారని పార్టీ నాయకులు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.

రోశయ్య భౌతికకాయంపై కాంగ్రెస్‌ పతాకాన్ని ఉంచి నివాళి అర్పిస్తున్న రేవంత్‌రెడ్డి,

రోశయ్య కుమారుడు శివసుబ్బారావు, వీహెచ్‌


రోశయ్య స్మారక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి

సీఎం కేసీఆర్‌ను కలవాలని కాంగ్రెస్‌ నిర్ణయం

హైదరాబాద్‌లో రోశయ్య మెమోరియల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌అలీ తెలిపారు. ఈ మేరకు పీసీసీ కార్యవర్గం, పీఏసీ సంయుక్త సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దీనిని అందచేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రోశయ్యకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశం అనంతరం షబ్బీర్‌అలీ, కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇతర అంశాలున్నా.. రోశయ్య సేవలు, మరణంపైనే చర్చించామన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని