Lance Naik Sai Teja: రావత్‌ను మెప్పించిన సాయితేజ

తమిళనాడులో చోటుచేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన బి.సాయితేజ (29) దుర్మరణం చెందారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ను మెప్పించి, ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిలో

Updated : 09 Dec 2021 04:56 IST

పారాట్రూపర్‌గా సత్తా చాటి రావత్‌భద్రతా బృందానికి ఎంపిక
భార్యకు వీడియోకాల్‌చేసిన గంటల్లోనే మృతి

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, మదనపల్లె: తమిళనాడులో చోటుచేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన బి.సాయితేజ (29) దుర్మరణం చెందారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ను మెప్పించి, ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిలో ఒకరిగా ఎదిగిన సాయితేజ మరణం జిల్లా వాసుల్ని కలచివేసింది. ఎగువరేగడకు చెందిన మోహన్‌, భువనేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన సాయితేజ 2012లో ఆర్మీ సిపాయిగా బెంగళూరు రెజిమెంట్‌ నుంచి ఎంపికయ్యారు. కొంతకాలం జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వర్తించారు. ఏడాది తర్వాత పారా కమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. ఎంపిక నుంచి శిక్షణ వరకు అనేక కఠిన సవాళ్లు ఎదుర్కొని పారా కమాండో అయ్యారు. మెరుపుదాడులు చేయడంలో దిట్టలైన వీరికి సైన్యంలో ప్రత్యేక స్థానం ఉంది. పారా కమాండోగా బెంగళూరుతో పాటు వివిధ వాతావరణ పరిస్థితుల్లో రాటుదేలారు. ఆకాశమార్గంలో నేరుగా శత్రుస్థావరాలకే వెళ్లి, వారిని మట్టి కరిపించే పారా ట్రూపర్‌గా ఎదిగారు. ఇందుకోసం కఠోర శిక్షణ పొందారు. అనంతరం సాయితేజ కొత్తగా వచ్చే పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ ఆయనలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి.. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. రావత్‌ ఆయనను చాలా అభిమానించేవారని స్నేహితులు అంటున్నారు. తమ్ముడు మహేష్‌బాబును సైతం సైన్యంలో చేరమని ప్రోత్సహించారు. ప్రస్తుతం ఆయన సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్నారు.

భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞతో సాయితేజ

భార్యకు వీడియో కాల్‌.. కొన్ని గంటల్లోనే దుర్మరణం
సాయితేజకు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ (5), కుమార్తె దర్శిని (2) ఉన్నారు. రావత్‌కు వ్యక్తిగత భద్రత సిబ్బందిగా చేరాక దిల్లీలోనే ఉంటున్నారు. సాయితేజ ఏడాది కిందట తన కుటుంబాన్ని మదనపల్లెకు మార్చారు. ఈ ఏడాది వినాయకచవితికి వచ్చి, కుటుంబసభ్యులతో గడిపారు. బుధవారం ఉదయం 8.15 గంటలకు భార్య శ్యామలకు సాయితేజ ఫోన్‌ చేశారు. కుమార్తె దర్శినిని చూడాలని ఉందంటూ.. వీడియోకాల్‌ చేయాలని భార్యకు చెప్పి, పిల్లల్ని చూస్తూ సంతోషంగా మాట్లాడారు. కొన్ని గంటల్లోనే సాయితేజ మరణించారనే కబురు విని కుటుంబం విషాద సాగరంలో మునిగిపోయింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని