Omicron: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు 4

దేశంలో మరో ఇద్దరికి ‘ఒమిక్రాన్‌’ సోకింది! వీరిలో ఒకరు గుజరాత్‌కు, మరొకరు మహారాష్ట్రకు చెందినవారు. వీటితో కలిపి కరోనా కొత్త వేరియంట్‌ కేసులు శనివారం 4కు చేరాయి. గుజరాత్‌లోని

Updated : 05 Dec 2021 05:17 IST

తాజాగా మరో ఇద్దరు బాధితులు...

టీకా రెండు డోసులు తీసుకున్న వృద్ధునికీ సోకిన కొత్త వేరియంట్‌!

దిల్లీ, ముంబయి: దేశంలో మరో ఇద్దరికి ‘ఒమిక్రాన్‌’ సోకింది! వీరిలో ఒకరు గుజరాత్‌కు, మరొకరు మహారాష్ట్రకు చెందినవారు. వీటితో కలిపి కరోనా కొత్త వేరియంట్‌ కేసులు శనివారం 4కు చేరాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు గతనెల 28న జింబాబ్వే నుంచి వచ్చాడు. జ్వరం రావడంతో ఈనెల 2న పరీక్ష చేయించుకోగా, కొవిడ్‌ పాజిటివ్‌ ఫలితం వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అతని నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా ఒమిక్రాన్‌ సోకినట్టు తేలింది. సదరు వ్యక్తి జింబాబ్వేలోనే ఉంటున్నాడని, కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకుని, తన మామను చూసేందుకని సొంతూరు వచ్చాడని ఆరోగ్యశాఖ కమిషనర్‌ జై ప్రకాశ్‌ శివహరే తెలిపారు. బాధితుడిని ఖరాడిలోని గురుగోవింద్‌ సింగ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించినట్టు వెల్లడించారు. అతడిని కలిసినవారిలో అత్యధిక ముప్పున్న 8 మందికి, తక్కువ ముప్పున్న మరో 31 మందికి పరీక్షలు నిర్వహించారు.అందరికీ నెగెటివ్‌ ఫలితమే వచ్చింది. అయితే, మరికొన్ని రోజులు క్వారంటైన్‌లోనే ఉండాలని అధికారులు వారికి సూచించారు.

ముంబయిలో 33 ఏళ్ల వ్యక్తి...

ముంబయిలోని కళ్యాణ్‌ డోంబివ్లీకి చెందిన 33 ఏళ్ల వ్యక్తి... గతనెల 23న దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌, దిల్లీ మీదుగా ముంబయి చేరుకున్నాడు. అతనికి తాజాగా పరీక్షలు నిర్వహించగా, ఒమిక్రాన్‌ సోకినట్టు తేలిందని మహారాష్ట్ర ఆరోగ్య విభాగం డైరెక్టర్‌ డా.అర్చనా పాటిల్‌ వెల్లడించారు. నలుగురితో కలిసి అతడు భారత్‌ వచ్చాడని, వారి నమూనాలను కూడా జన్యు విశ్లేషణకు పంపుతున్నామని తెలిపారు. ఇంతకుముందు కర్ణాటకలో ఇద్దరు వ్యక్తులకు క్తొత వేరియంట్‌ సోకిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా దేశస్థుడు కాగా, మరొకరు స్థానిక ప్రభుత్వ వైద్యుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని