Updated : 06/12/2021 05:24 IST

Omicron: మరో 17 ఒమిక్రాన్‌ కేసులు

రాజస్థాన్‌లో ఒకేరోజు 9 మందికి
మహారాష్ట్రలో 7.. దిల్లీలో ఒకరికి
దేశంలో 21కి చేరిన బాధితులు

దిల్లీ: కరోనా వైరస్‌లో కొత్త రకమైన ఒమిక్రాన్‌ అటు రాజస్థాన్‌, ఇటు మహారాష్ట్రల్లో ఒక్కసారిగా జూలు విదిల్చింది. ఆదివారం రాజస్థాన్‌లో తొమ్మిది మంది, మహారాష్ట్రలో ఏడుగురు దీని బారిన పడినట్లు నిర్ధారణ అయింది. దిల్లీలోనూ ఒక కేసు వెలుగు చూసింది. దీంతో ఒక్కరోజులోనే 17 కేసులు వచ్చి, దేశవ్యాప్త సంఖ్య 21కి ఎగబాకింది. వీరిలో దాదాపు అందరూ ఇటీవల ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారు, లేదా అలాంటివారికి సన్నిహితంగా ఉన్నవారే. జన్యుక్రమ పరీక్షల్లో వీరి విషయం బయటకు వచ్చింది. నైజీరియా నుంచి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మహారాష్ట్రకు వచ్చిన మహిళ, ఫిన్లాండ్‌ నుంచి వచ్చిన ఆమె సోదరుడు, మరో వ్యక్తి ఒమిక్రాన్‌ బాధితులైనట్లు పరీక్షల్లో తేలింది. వీరితో కలిసి మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. వీరికి సన్నిహితంగా వచ్చిన 13 మందిని గుర్తించి, పరీక్షలు జరిపారు. కొద్దిరోజుల క్రితం టాంజానియా నుంచి దిల్లీకి తిరిగి వచ్చిన 37 ఏళ్ల పురుషుడిని పరీక్షించినప్పుడు ఆదివారం వైరస్‌ బయటపడింది. ఆయన ఇప్పటికే రెండు డోసులూ తీసుకున్నారు. స్పల్ప లక్షణాలున్న ఆ వ్యక్తిని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ‘ఇటీవల విదేశాల నుంచి దిల్లీకి వచ్చినవారిలో 17 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిలో 12 మంది నమూనాలను జన్యు పరీక్షల కోసం పంపించగా.. ఒకరిలో ఒమిక్రాన్‌ బయటపడింది’ అని దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ విలేకరులకు తెలిపారు. ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట వేయాలంటే అంతర్జాతీయ విమానాలన్నింటినీ నిషేధించడం అవసరమన్నారు. పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి దగ్గరగా విమానంలో కూర్చొన్న 10 మందిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఒమిక్రాన్‌ ప్రభావం స్వల్పమే : ఐఐటీ-కాన్పుర్‌ ప్రొఫెసర్‌

దిల్లీ: కరోనా మూడో దశ ‘ఒమిక్రాన్‌’ ప్రభావం స్వల్పంగానే ఉండనుంది. జనవరి-ఫిబ్రవరి నెలల్లో అది గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. గణిత శాస్త్రం ప్రకారం ఐఐటీ-కాన్పుర్‌కు చెందిన ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ప్రభుత్వం ఆమోదించిన ‘సూత్ర’ అనే విధానం ఆధారంగా ఆయన ఈ అధ్యయనం చేశారు. ఆ సమయంలోనే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరగనుండడం గమనార్హం. ఒమిక్రాన్‌కు భయపడాల్సిందేమీ లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఫ్రొపెసర్‌ అగర్వాల్‌ భరోసా ఇస్తున్నారు. శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధశక్తిని ఇది హరించబోదని ఆయన తెలిపారు. ఒకవేళ సోకినా క్లిష్ట సమస్యలు తీసుకురాదని, స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని చెప్పారు. గరిష్ఠ స్థాయికి చేరిన సందర్భంలో కూడా దాని ప్రభావం తక్కువగా ఉంటుందని అన్నారు. మూడో దశ రావడం ఖాయమని, ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే దీని ప్రభావం ఆధారపడి ఉంటుందని తెలిపారు. రాత్రి వేళ కర్ఫ్యూలు, గుంపులుగా చేరడంపై నిషేధం వంటి చర్యలు సరిపోతాయని అభిప్రాయపడ్డారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని